తెలంగాణ బడ్జెట్ : హైదరాబాద్‌ పై కేసీఆర్ మాస్టర్ ప్లాన్

June 05, 2020

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి హరీష్ రావు ఆదివారం (మార్చి 08) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10,000 కోట్లు కేటాయించారు. కోటి మందికి పైగా జనాభా నివసిస్తోన్న హైదరాబాద్ నగరానికి ప్రత్యేక నిధులు కేటాయించడం గమనార్హం. ఆదాయం భాగ్యనగరం నుండే ఎక్కువ వస్తోంది. దీంతో బడ్జెట్‌లో నగరానికి ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్‌లో మున్సిపల్ శాఖకు రూ.14,809 కోట్లు కేటాయించారు. భాగ్యనగరం, పరిసర ప్రాంతాలకు అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించారు.

హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అమలు తదితరాల కోసం వీటిని కేటాయించారు. భాగ్యనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోడానికి రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా. హైదరాబాద్ అర్బన్ అగ్లామిరేషన్ పేరుతో రూపొందించిన కార్యక్రమానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.10 వేట్లు కేటాయించారు. మిగతా నాలుగేళ్లు కూడా దీనిని కొనసాగిస్తారు. తద్వారా రూ.50వేల కోట్లు అవుతుంది.

పాతబస్తీ నుండి 5 కిలో మీటర్ల మెట్రో మార్గం త్వరలో పూర్తి చేయనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్, బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మూడు నెలల్లో తెలంగాణలోని అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించనున్నారు.  పట్టణాలు, నగరాల అభివృద్ధికి రూ.148కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు హరీష్.

ఇంటింటికి మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని మంత్రి తెలిపారు. పట్టణ మిషన్ భగీరథ కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ.800 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం పూర్తయ్యాక తెలంగాణలో గోదావరి నది 150 కి.మీ. పొడవునా సంవత్సరమంతా నీళ్లతో కళకళలాడుతుందని చెప్పారు. గోదావరి రివర్ ఫ్రంట్ టూరిజం పేరుతో చేపట్టబోయే ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు.

మొక్కల పెంపకానికి రూ.300 కోట్ల నిధులు కేటాయించారు. సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే పదిహేను నుండి యాభై శాతం వరకు నిధులు పెంచినట్లు హరీష్ తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు డబుల్ బెడ్రూం పథకానికి రూ.11,917 కోట్లు ప్రతిపాదించారు.