కేసీఆర్ చేసిన పనితో అంతా అయోమయం

October 17, 2019

సెక్రటేరియట్ కూల్చి కొత్తది నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచన ఇప్పుడు తెలంగాణలో పాలన తప్పే పరిస్థితికి కారణమవుతోంది. పాత సెక్రటేరియట్‌ను కూల్చి కొత్తది నిర్మించడంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతుండడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సచివాలయం వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు భవనాల్లోకి తరలిస్తుండడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతా ఒకే చోట ఉన్న సమయంలోనే ఇష్టారాజ్యంగా ఉండేదన్న విమర్శలు తెలంగాణ సెక్రటేరియట్‌పై ఉండేవి. కేసీఆర్, ఆయనలానే చాలామంది మంత్రులు సెక్రటేరియట్‌కు వచ్చేవారు కాదు. దీంతో అక్కడ కొద్దిమంది అధికారుల ఇష్టారాజ్యం సాగేది. అలాంటిది ఇప్పుడు ఒక్కో విభాగం ఒక్కో చోట ఉంటే పాలన గాడి తప్పడం ఖాయమన్న విమర్శలువినిపిస్తున్నాయి.
సచివాలయంలోని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆ భవనం చాలకపోతే సమీపంలోని ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొన్ని శాఖలు తరలించాలని నిర్ణయించింది. అటవీశాఖను అరణ్య భవన్ లోకి, ఆర్ అండ్ బీ శాఖను ఎర్రమంజిల్ కు, మిగిలిన శాఖలన్నింటిని బీఆర్ కే భవన్ కు తరలించనున్నారు. రెండు వారాల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించింది. సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్కో శాఖ ఒక్కో చోట ఉంటే సమన్వయం కొరవడుతుందని.. బాధ్యతారాహిత్యం పెరిగిపోతుందని అంటున్నారు.