హైకోర్టు కోపానికి గురైన కేసీఆర్...  

August 03, 2020

కరోనా తెలంగాణలో అనూహ్య రీతిలో విజృంబిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం అసలు దానిని కొద్దిరోజులుగా లెక్కలోకి తీసుకోవడం లేదు. మొదట్లో భయపడిన కేసీఆర్ ఇపుడు దానిని పట్టించుకోవడం మానేశారు. టెస్టులు చేయడానికి సుతరామూ ముందుకు రావడం లేదు. దీనిపై మీడియా నుంచి మేధావుల వరకు అందరూ విమర్శిస్తున్నారు. 

తాజాగా హైకోర్టు ఈ విషయంలో కేసీఆర్ సర్కారుపై సీరియస్ అయ్యింది. కరోనా పరీక్షల విషయంలో ఆదేశాలు అమలు చేయడం లేదని.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది. 

నిర్లక్ష్యం ఈ స్థాయిలోనా.... ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం. ఏం తేడా వచ్చినా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తాం అని కోర్టు మండిపడింది. మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాల అమలు కావడం లేదని పేర్కొంది.  తాజాగా కరోనా గణాంకాలపై మరో పిటిషను దాఖలైంది. ప్రభుత్వం సరైన రీతిలో వెల్లడి చేయడం లేదని పిటిషనరు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారిస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

దీనికి తెలంగాణ ఏజీ ఏం చెప్పారో తెలుసా...  సుప్రీంకోర్టులో సవాల్ చేశాం, అందుకే పట్టించుకోలేదన్నట్లు సమాధానం ఇచ్చారు. దీనిపై ఒకింత అసహనానికి గురైన బెంచ్... ఆ తీర్పు వచ్చేవరకు తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాకుండా ప్రజలకు పరీక్షలు ఎందుకు తగినన్ని చేయడం లేదని ప్రశ్నించింది.  పీపీఈ కిట్లు కొరత వల్లే డాక్టరుకు కరోనా సోకడం నిజం కాదా అని ప్రశ్నించింది.

కరోనా గణాంకాలు దాస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.. దాచడం వల్ల ఉపయోగం లేదు. పైగా ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కరోనా కేసుల గణాంకాలకు మరింత ప్రచారం కల్పించండి అని కోర్టు సూచించింది. మొత్తం వ్యవహారంపై నివేదిక కోరింది.