తెలంగాణ హైకోర్టు సంచలనం... కేసీఆర్ సర్కారుకి లాస్ట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్

August 07, 2020

మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వడం కోసమే ఇంతకాలం వేచి చూశాం... ఇక కోర్టు సహనాన్ని పరీక్షించొద్దు. మీకు ఇదే చివరి అవకాశం అంటూ... తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కరోనా టెస్టులు, మీడియా బులెటిన్ విషయంలో అసంబద్ధమైన వివరాలు పేర్కొంటున్నారని, బులిటెన్ లో సమగ్ర సమాచారం లేదంటూ... తక్షణం వాటిని సరిదిద్దుతూ బులిటెన్ విడుదల చేయాలని ఆదేశించింది. కేసులు పెరుగుతుంటూ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం తీవ్రమైన తప్పిదం అని పేర్కొంది.  

ఇక నుంచి కోర్టు ఆదేశాలు కచ్చితంగా అమలు కావల్సిందే అంటూ హెచ్చరించింది. ఇదే ఆఖరి అవకాశం అని పేర్కొంది. బులిటెన్లో జిల్లాల వారీగా కరోనా కేసులతో పాటు వారి ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు ఉండాలని పేర్కొంది. రాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే విషయాలను ఆయా జిల్లా కలెక్టర్లు కచ్చితంగా వెల్లడించాలని ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ వెబ్‌సైట్‌ను సమగ్ర సమాచారంతో అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది.

తప్పులతడకగా, అజాగ్రత్తగా ఉన్న మీ పని విధానంపై మేము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తుంటే హైకోర్టు అభినందించినట్టు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పిదారి పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహించింది. జులై 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఇంకా ఏం చెప్పింది?

  • కరోనా చికిత్స ఫిర్యాదుల కోసం వాట్సప్ నెంబరుకు విస్తృత ప్రచారం కల్పించాలి.
  • ప్రజల ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచి ఫిర్యాదులు స్వీకరించాలి.
  • పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు అవుతున్నారు. దానిని అడ్డుకోవాలి. 
  • హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటాం.
  • కరోనా పరీక్షల విషయంలో.. ఏపీ, ఢిల్లీలతో పోలిస్తే తెలంగాణ బాగా వెనుకపడి ఉంది
  • కరోనా బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాస్తున్నారు.