కేసీఆర్ సర్కారుకు హైకోర్టు షాక్

June 06, 2020

ప్రభుత్వం అన్నాక సవాలక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో జరిగే ప్రతి పొరపాటుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. వంద ఒప్పులు చేసినా.. ఒక్క తప్పు చాలు.. ఇమేజ్ డ్యామేజ్ కావటానికి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేయటానికి పలు వ్యవస్థలు ఉన్నాయి. వివరణ కోరే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ మధ్యన తీసుకున్న ఒక నిర్ణయంపై హైకోర్టు తాజాగా స్పందించిన తీరుతో కేసీఆర్ సర్కారుకు తలనొప్పి తప్పదన్న మాట వినిపిస్తోంది.
సినీ దర్శకుడు ఎన్. శంకర్ కు ఎకరం రూ.5లక్షల చొప్పున ఐదు ఎకరాల్ని కేటాయించటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఎందుకంటే.. సదరు భూమి విలువ ఎవరం రూ.5 కోట్లుగా చెబుతున్నారు. అంటే.. రూ.25 కోట్ల విలువైన భూమిని రూ.25లక్షలకు కేటాయించటంపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.
సినీ స్టూడియో కోసం ఔటర్ రింగురోడ్డుకు సమీపంలోని నివాస ప్రాంతంలో అంత ఖరీదైన భూమిని ఎందుకు కేటాయించారో చెప్పాల్సిందిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రీతిలో సమర్థించుకుంటారో కౌంటర్ లో తెలియజేయాలని కోరింది.
తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని.. ప్రభుత్వం జారీ చేసిన జీవోనురద్దు చేయాలని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.. హైకోర్టు తాజాగా విచారించింది. కోట్లాది రూపాయిల విలువైన భూముల్ని ఇంత తక్కువ ధరలకే అమ్మటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పలు వ్యాఖ్యలు హైకోర్టు విచారణలో ఉన్నాయి. ఇలాంటివేళ.. హైకోర్టు సంధించిన ప్రశ్నకు కేసీఆర్ సర్కారు ఏ రీతిలో సమాధానం ఇస్తారో చూడాలి.