కేటీఆరా మజాకా... ఇంటర్లో తప్పుల్లేవు, అన్నీ అపోహలేనట

July 04, 2020

తప్పు చేసినపుడు టీఆర్ఎస్ నేతలు నటించే తీరు అసాధారణం. 18న వచ్చిన ఫలితాలు ఇప్పటివరకు 12 మందికి పైగా జీవితాలను కబళించాయి. ఇంటర్ విద్యార్థులు మార్కుల గోలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కాలపు ఒత్తిడి, సిలబస్, విద్యా విధానం ప్రతిదాంట్లో పొరపాటు వల్లేఇలా జరిగిందని అందరికీ తెలుసు. అయితే, పాపం బాగా చదివి బాగా రాసిన విద్యార్థులకు కూడా చుక్కలు చూపించారు తెలంగాణ సర్కారు దొరలు. రాజకీయాలపై దృష్టిపెట్టి, సచివాలయాన్ని గాలికి వదిలేసి ఏం సచివాలయం నుంచే పాలించాలా అని ప్రశ్నించే పెద్ద దొర చిన్న దొర ఈరోజు బలితీసుకున్న ప్రాణాలు పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

తీవ్రమైన నిర్లక్ష్యంతో పేపర్ వాల్యూయేషన్ జరగడంతో ఒక విద్యార్థికి జీరో మార్కులు వచ్చాయి. చిత్రం ఏంటంటే... రీ వాల్యూయేషన్లో అతనికి 99 శాతం మార్కులు వచ్చాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు తెలంగాణ సర్కారు ఎంత దారుణంగా ఆడుకుంటుందో. విద్యా మంత్రి జగదీష్ రెడ్డి మూడు రోజుల తర్వాత నిద్రలేచారు. అయితే, ఇంటర్ ప్రతి విద్యార్థికి కీలకం కావడంతో వీరి పరువు పోతుందని అర్థమయ్యాక టీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. హరీష్ ట్విట్టరులో కన్నీటిబొట్లు కారుస్తూ ప్రాణాలు తీసుకోవద్దు అని ట్వీట్ వేశారు. గతంలో చాలామంది చనిపోయినా ఎపుడూ ఇలా వీళ్లు ట్వీటలేదు. ఎందుకంటే ఇపుడు నిర్లక్ష్యంతో దొరికిపోవడంతో ఇలా తప్పించుకునే కబుర్లు చెబుతున్నారు. 

తెలంగాణ ప్రభుత్వ తీరు, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో విసుగెత్తిపోయిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేశారు. పరీక్షలు బాగానే రాసినప్పటికీ.. బోర్డ్ తప్పిదాల కారణంగా మార్కులు సరిగా వేయలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఒక సబ్జెక్టులో ఫెయిలైనట్టుగా ఫలితాలు రావడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు కొన్ని పేపర్లలో అయితే కనీసం మార్కులు కూడా వేయకుండా వదిలేశారట. పరీక్ష రాసినా అసలు మార్కులు కనపించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళ చెందుతున్నారు. ఏపీ ఫలితాలను విడుదల చేసిన ఒత్తిడితో హడావుడిగా విడుదల చేయడం వల్ల ఈ తప్పిదాలు జరిగాయని... ఇవి 12 మందిని బలితీసుకున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. 

KTR Tweet :

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నేడు సమీక్షించారు. ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఏ ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

ఈ కేటీఆర్ ట్వీట్లో మూడు విషయాలు గమనించాలి.

  1. తప్పులు జరిగాయిన పక్కా సాక్ష్యాలున్నాయి. ఇది గవర్నమెంటుకు కూడా తెలుసు. అయినా దానిని ఒప్పుకోకపోవడంతో పాటు అపోహలు అంటూ వ్యాఖ్యానించాడం అహంకారం కాదా. తప్పుకు సారీ కూడా చెప్పలేరా?
  2. తప్పులు చేసింది గవర్నమెంటు.. ఇన్ని తప్పులు జరిగినపుడు రివిజన్డ్ ఫలితాలు రిలీజ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవచ్చు కదా..ఎందుకు విద్యార్థులు రీ వెరిఫికేషు కోసం డబ్బులు కట్టి నానా కష్టాలు పడాలి? ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి విద్యార్థులు ఎందుకు బాధ్యత వహించాలి? 
  3. తప్పు జరిగినట్లు 19వ తేదీన తెలిస్తే మూడు రోజులు ఆలస్యంగా ప్రభుత్వం స్పందించడం బాధాకరం కాదా?