అసెంబ్లీకి కోదండరాం... ఎలా?

September 16, 2019

తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకన్నారు. ఇంతవరకు తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ సరైన ఫలితాలు చవిచూడని కోదండరాం మరో ఎన్నికలో తనకు తాను పరీక్ష పెట్టుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ గెలిస్తే కేసీఆర్ ఫిరాయింపులపై రెఫరెండంగా అవుతుందని కాంగ్రెస్ అంటోంది. అక్కడ గెలిచి పరువు కాపాడుకుని, కేసీఆర్ చేసింది రైట్ అనిపించుకుందామని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యలో దూరి సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రొఫెసర్ కోదండరాం.

హుజూర్ నగర్ సీటుకు ఆయన స్వయంగా పోటీ చేయబోతున్నారు. గత ఫలితాలు చూశాక ఆయన గెలుపుపై ఎవరికీ అంచనాలు లేవు. కాకపోతే కోదండరాం ఏ పార్టీకి నష్టం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయన ముందు నుంచి టీఆర్ఎస్ సానుభూతి పరుడుగా ఉన్నారు కాబట్టి ఆయన సానుభూతి పరుల్లో ఎక్కువగా టీఆర్ఎస్ నుంచి చీలిన వాళ్లే అంటున్నారు. కోదండరాం గెలుపు కోసం ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు, టీవీయూవీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ప్రచారం చేయనున్నారట. అంటే వీళ్లు టీఆర్ఎస్ ఓట్లు చీల్చే అవకాశాలే ఎక్కువ. మరి మాస్టారు టీఆర్ఎస్ ని దెబ్బకొడతారేమో అనుకోవచ్చు. 

మరోవైపు బీజేపీ నిర్ణయం కూడా ఇక్కడ ప్రభావితం చూపనుంది. ఈ స్థానంలో బీజేపీ పోటీ చేస్తే ఎవరిని నిలబెడుతుందో ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ సతీమణి పద్మావతి ఉప ఎన్నికలో తన భర్తస్థానంలో బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి, ఓడిపోయిన సైదిరెడ్డికే మళ్లీ టికెట్‌ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సానుకూలంగా ఉన్నారు. 

ఈ చతుర్మఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో.