మీడియా మీద సీఎం కేసీఆర్ కు కంప్లైంట్ చేసిందెవరు? ఎందుకు ?

August 03, 2020

తెలంగాణలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ మాటకు వస్తే.. అలా జరిగిందన్న విషయాన్ని వెల్లడించింది కూడా ముఖ్యమంత్రి కార్యాలయమే. గతానికి భిన్నంగా మీడియాలో వచ్చే వార్తల వెనుక కొత్త తీరు మొదలైంది. ముఖ్యమంత్రితో ఎవరైనా సమావేశమైతే.. దానికి సంబంధించిన వివరాల్ని మీడియాకు వెల్లడించేందుకు ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు ముందుకు వచ్చేవారు.

మారిన కాలానికి తగ్గట్లు.. కొన్నేళ్లుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న మార్పులతో.. సీఎంవో విడుదల చేసినట్లుగా సమాచారం ఉండదు కానీ.. వచ్చేది మాత్రం సీఎంవో నుంచే. సోమవారం రాత్రి కాస్త ఆలస్యంగా అలాంటి ప్రెస్ నోట్ ఒకటి బయటకు వచ్చింది.

సోమవారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమీక్షలో వైద్యనిపుణులు పలువురు మీడియా మీద కంప్లైంట్ చేసినట్లుగా సీఎంవో నుంచి జారీ అయిన ప్రెస్ నోట్ చెబుతోంది. ఈ సమీక్షలో మంత్రి ఈటెల రాజేందర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. కమిషనర్ యోగితా రాణా.. డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల కాలంలో పాజిటివ్ కేసుల తీవ్రత పెరగటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న వార్తలు.. కథనాలపై అధికారుల వెర్షన్ వేరుగా ఉంటుందని చెబుతున్నారు. పాజిటివ్ అయిన వారికి చికిత్స చేసేందుకు అన్ని రకాల సదుపాయాలు.. పరికరాలు సిద్ధంగా ఉన్నాయని.. మీడియా ప్రచారానికి.. వాస్తవానికి పొంతన లేదన్న మాటను ముఖ్యమంత్రికిచెప్పినట్లు చెబుతున్నారు.

గాంధీలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉందని.. ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు వెయ్యి ఉన్నట్లుగా చెప్పినట్లుగా పేర్కొన్నారు. గాంధీలో ఉన్న సౌకర్యాల్ని పూర్తిగా వాడుకునే అవసరమే ఇంతవరకు రాలేదన్న వారు.. తమపై తరచూ ఉద్దేశపూర్వకంగా కోర్టుల్లో కేసులు వేయటంతో తాము కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోయారు. ఈ కారణంతో తాము వైద్యసేవలు అందించటంలో ఇబ్బంది కలుగుతోందన్నారు.

ఏ కారణంతో మరణించినా సరే.. వారందరికి నిర్దారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశం అమలు సాధ్యం కాదని.. రాష్ట్రంలో రోజుకు సగటున 900-1000 మధ్యలో మరణిస్తారని.. అందరికి పరీక్షలు చేయటమే పనిగా పెట్టుకుంటే ఇతర వైద్య సేవలు అందించటం అసాధ్యమని చెప్పటం గమనార్హం.
ఈ వాదన విన్నప్పుడు సీఎం కేసీఆర్ కు అధికారులు చెబుతున్న వాదనలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.

ఉదాహరణకు గాంధీ ఆసుపత్రి సామర్థ్యం గురించిన లెక్కలే చూస్తే.. 1200 కంటే కాస్త తక్కువ బెడ్లు అందుబాటులో ఉండేవి. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ మధ్యనే 350 కొత్త బెడ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ లెక్కన చూసినప్పడు 1550 బెడ్లు మాత్రమే లెక్కలోకి వస్తాయి. అలాంటిది గాంధీలో 2150 బెడ్లు ఉన్నాయని సీఎంకు ఎలా చెబుతారు? అన్నది ఒక ప్రశ్న.

ఒకవేళ ఇటీవల కాలంలో బెడ్ల సంఖ్యను పెంచి ఉంటే.. దానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని పంపి ఉంటే.. మీడియాకు సమాచారంతో పాటు.. ప్రజలకు ఆ సమాచారం అందేది కదా? అన్న వాదన వినిపిస్తోంది. ఇక.. మరణించిన వారికి పరీక్షలు చేయటం. కోర్టు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి చేయటం కష్టమే కావొచ్చు. కానీ.. అసాధ్యమైతే కాదు.

మహమ్మారి లాంటి అపాయకర పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు ఎదురైనా.. అలా చేయటం ద్వారా.. మరణం వెనుక మాయదారి రోగం ఉందా? లేదా? అన్నది తేలుతుంది. అలా తేలినప్పుడు కొత్తకేసుల్ని ప్రాథమిక స్థాయిలోనే కట్టడి చేసే వీలుంది. ఇంత పెద్ద వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడు అసాధ్యమైనవి ఏమీ ఉండవు కదా?

ఒకవేళ.. ఇబ్బందిగా ఉంటే కొత్త సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసుకోవటం.. అందుకు తగ్గ మెకానిజం అందుబాటులోకి తెస్తే సరిపోతుంది కదా? అవన్నీ వదిలేసి.. మీడియా మీద ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేసే కన్నా.. సాపేక్షంగా సమస్యను చూస్తే పరిష్కార మార్గం కనిపించటమే కాదు.. ప్రజల్లో మరింత స్థైర్యం పెరుగుతుందన్నది ఎందుకు మిస్ అవుతున్నట్లు?