టీ పీసీసీ ప‌ద‌విపై ఆ ఇద్ద‌రు రెడ్లు ఫిక్సింగ్‌...!

July 15, 2020

అడ‌గ‌బోయినా...అల్లీసాబ్‌రాలేదు..పిల‌వ‌బోయిన పీర్‌సాబ్ రాలేద‌న్న‌ట్లుగా త‌యారైంది పీసీసీ చీఫ్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి. రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ నియామ‌కమ‌వుతార‌ని ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వార్త‌లు వినిపించాయి. అయితే ఎన్నిక‌లు ముగిసి ఏడాది కావస్తున్నా ఆ వార్త‌లు నిజం కాలేదు. కానీ హుజూర్‌న‌గ‌ర్‌లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌తీమ‌ణి ఓట‌మి త‌రువాత ఖ‌చ్చితంగా పీసీసీ చీఫ్‌గా కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు ఆ పార్టీ నేత‌లు. ఈ స‌ద‌వ‌కాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోవ‌ద్ద‌న్న రాతిలో ప‌లువురు సీనియ‌ర్లు, పార్టీలో చురుకుగా..జ‌న‌బ‌లం, అధిష్ఠానం అండ‌దండ‌లు ఉన్నాయ‌ని భావిస్తున్న అరడ‌జ‌ను నేత‌లు రేసులో నిలుస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీ బాధ్య‌త‌లు త‌న‌కు అప్ప‌గిస్తే కేసీఆర్‌ను ఢీకొడ‌తాన‌ని ఎవ‌రికి వారు చెప్పుకొస్తున్నార‌ట‌.  పీసీసీ సీటు కోసం  రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్‌, సీనియర్ల కోటలో వీహెచ్‌ తదితరులు పోటీపడుతున్నారు. రేసులో ఉన్న నేతల్లో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ఒకరంటే ఒకరికి పడదు.
ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటారు.  రెడ్డి సామాజిక వ‌ర్గానికే పీసీసీ ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న ప్ర‌చారంలో రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి పేర్లు కూడా బ‌లంగా వినిపిస్తున్న మాట వాస్తవం. అయితే వీరిద్ద‌రు అగ్గిమీద గుగ్గిలంలా ఉంటారు. ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌దు. అలాంటి ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య ఒప్పందం కుదురిన‌ట్లు  ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు క‌ల‌సి అమెరికాకు వెళ్లార‌ని, అక్క‌డ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన స‌న్నిహితులు ఇద్ద‌రూ క‌ల‌సిఉండాల‌ని సూచించారట‌.
ప‌నిలో ప‌నిగా పీసీసీ చీఫ్ ప‌ద‌విని కూడా చెరో రెండున్న‌రేళ్లు చేప‌ట్టాల్సిందిగా సూచించిన‌ట్లు తెలుస్తుండ‌టం గ‌మ‌నార్హం. ముందు రెండున్న‌రేళ్లు కోమ‌టిరెడ్డి, చివ‌రి రెండేళ్లు రేవంత్‌రెడ్డి ప‌దవి చేప‌ట్టేలా ప్రతిపాదించ‌గా దీనికి ఇద్ద‌రు నేత‌లు స‌మ్మ‌తం వ్య‌క్తం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా ఈ విష‌యం తెలిసిన మిగ‌తా న‌లుగురు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఏమైనా ప‌ప్పుబెల్ల‌మా...? ప‌ంచి పెట్ట‌డానికి అంటూ ఎద్దేవా చేస్తున్నార‌ట‌. చూడాలి ఎవ‌రి ఎత్తుగ‌డ ఫ‌లిస్తుందో..!