కేసీఆర్ సార్... తూచ్, ఇది మోసం మేమొప్పుకోము !

August 07, 2020

కేసీఆర్... కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం బాగుపడింది. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. కానీ కేసీఆర్ దగ్గర చాలా ట్రిక్కులు ఉంటాయి. ఇది కూడా అందరూ గమనించాల్సిన విషయం. నిన్నటి నుంచి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే... ముఖ్యమంత్రి కాన్వాయ్ పై ఫైన్లు వేశారట. అదీ వార్త. నిన్నటి నుంచి మీడియాల్లో ఊదరగొడుతున్నారు. పెద్ద పెద్ద మీడియాలు అని చెప్పుకునే వారు కూడా దీని గురించి ఒక్క క్షణం ఆలోచించకుండా గ్రేట్ అని రాస్తున్నారు.

వాస్తవానికి ఇదో పెద్ద మాయా ట్రిక్. ప్రజలను ట్రాప్ లో పడేసిన ట్రిక్. కాకపోతే ట్రాప్ లే వేసింది మంచికే అందుకే ఈ మాయను కూడా క్షమించాలి. అసలు విషయం ఏంటంటే...  ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయట. సీఎం కాన్వాయ్‌పై అయినా ఓవర్ స్పీడ్ పోతే చలాన్లు వేస్తారట. ఏడాది నుంచి మొత్తం నాలుగు ఫైన్లు వేశారట. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఫైన్లు అన్నీ కట్టేసిందట. వావ్ !! అంటున్నారు. 

ఇపుడు మన కామన్ సెన్స్ వాడి ఈ డౌట్లు అడుగుదామా?

1. ముఖ్యమంత్రి కాన్వాయ్ ... ఆ మాటకొస్తే మంత్రి కాన్వాయ్ కూడా ఎపుడూ స్పీడ్ పరిమితిని పాటించవు. ఏడాదిలో లాక్ డౌన్ తీసేస్తే ఆల్మోస్ట్ ప్రతి రోజు సీఎం కాన్వాయ్ బయట తిరుగుతుంది. మరి నాలుగు సార్లే ఫైన్లు వేయడం ఏంటి? మిగతా చోట్ల, ఇతర సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు పనిచేయలేదా. ఏడాదిలో నాలుగు సార్లే గుర్తించారా?

2. కాన్వాయ్ లో దాదాపు 20 కార్లు ఉంటే... ముఖ్యమంత్రి కారుకు మాత్రమే ఫైన్ వర్తిస్తుందా? మిగతా కార్లకు వర్తించవా ఫైన్లు.

3. మిగతావి డ్యూటీలో భాగంగా వేయలేదు అనుకుంటే ముఖ్యమంత్రి కూడా ఆన్ డ్యూటీ కదా? ఆయనకు ఎందుకు వేశారు?

4. మరి ఇతర మంత్రులు, గవర్నర్ కాన్వాయ్ లకు స్పీడ్ లిమిట్ చలాన్లు వేయరా? ఎందుకు?

ఇవన్నీ ఒకెత్తు... ఇపుడు అసలు ప్రశ్న...

ముఖ్యమంత్రి కారుకు ఫైను వేస్తే ఫైను కట్టింది ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ ఖజానా నుంచి ట్రాఫిక్ డిపార్ట్ మెంటుకు ఫైను కట్టింది. ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వసూలు చేసిన డబ్బులు మళ్లీ తిరిగి వచ్చి ప్రభుత్వ ఖజానాకే. అంటే ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వానికి కట్టారు. ఇక్కడ డబ్బులు చేతులే మారలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక తన జీతంలో కట్ చేసి కట్టమని చెప్పి ఉంటే అది వార్త. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి కడితే అది ఎలా వార్త అవుతుంది. ఊరికే పబ్లిసిటీ స్టంట్ కాకపోతే.. !! తూచ్... మీరు ఎవరూ ఫైన్ కట్టకుండా ప్రజల్ని మాయ చేస్తారా? ఇది మేము ఒప్పుకోం కేసీఆర్ సార్. 

ఏమైనా పబ్లిసిటీ ఐడియాలు మీకు వచ్చినట్లు ఎవరికీ రావులెండి.