కేసీఆర్ కల ఈసారైనా నిజమవుతుందా?

May 26, 2020

అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగే వ‌ర‌కూ వ‌ద‌ల‌ని త‌త్త్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ది.  ఏదైనా ప‌ని పెట్టుకున్న త‌ర్వాత అది జ‌ర‌గ‌కుండా ఆయ‌న అస్స‌లు ఊరుకోలేరు. చేతిలో తిరుగులేని అధికారం ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న కోరుకున్న‌ట్లుగా త‌న‌దైన స‌చివాల‌యం.. త‌న మార్క్ ఉండేలా అసెంబ్లీ భ‌వ‌నాల్ని నిర్మించ‌లేక‌పోయాన‌న్న భావ‌న ఆయ‌న‌కు ఎక్కువ‌గా ఉంది.
త‌న‌కున్న సెంటిమెంట్ల ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యం.. అసెంబ్లీ అంటే ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్.. తెలంగాణ మార్క్ ఉండేలా కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఇందుకోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. స‌చివాల‌యం కోసం చాలానే చోట్ల భూమికోసం ప్ర‌య‌త్నం చేసి.. ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న‌.. చివ‌ర‌కు ఉన్న చోట‌నే పాత భ‌వ‌నాల్ని కూల్చేసి.. సరికొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయ‌న చాలానే క‌స‌ర‌త్తు చేశారు. 
విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న ఖాళీ చేసి.. ఆ భ‌వ‌నాల్ని కూల్చేసి.. కొత్త స‌చివాల‌యాన్ని భారీగా నిర్మించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఏపీకి ఇచ్చిన భ‌వ‌నాల్ని వెన‌క్కి తీసుకున్న ఆయ‌న‌.. తాజాగా కొత్త స‌చివాల‌య నిర్మాణానికి కీల‌క‌మైన శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది.
స‌చివాల‌యం న‌మూనాల‌ను 2016లోనే ముంబ‌యికి చెందిన ఆర్కిటెక్ట్ సంస్థ చూపించ‌టం.. వాటిల్లో ఒక న‌మూనాకు కేసీఆర్ ఓకే చేయ‌టం తెలిసిందే. అప్ప‌ట్లో ఓకే చేసిన డిజైన్ ను.. తాజాగా నిర్ణ‌యించిన ముహుర్తంలో శంకుస్థాప‌న చేప‌ట్టి.. స‌చివాల‌య నిర్మాణాన్ని వాయువేగంతో పూర్తి చేయాల‌న్న‌ది కేసీఆర్ ల‌క్ష్యంగా చెబుతున్నారు. 
సికింద్రాబాద్ బైస‌న్ పోలోలో స‌చివాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని భావించినా.. కేంద్రం నుంచి అనుమ‌తిరాని నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన స‌చివాల‌య ప్రాంగ‌ణంలోనే కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 26 లేదంటే 27 తేదీల్లో స‌చివాల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ముంయికి చెందిన ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్ హ‌ఫీజ్ కాంట్రాక్ట‌ర్ నుఅధికారికం ఆర్కిటెక్ట్ క‌న్సెల్టెంట్ గా నియ‌మిస్తూ త్వ‌ర‌లోనే అధికారిక ఉత్త‌ర్వును విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. కొత్త వాటి విష‌యంలో మ‌హా మోజును ప్ర‌ద‌ర్శించే కేసీఆర్.. త‌న చిరకాల‌ కోరికైన స‌చివాల‌యాన్ని పూర్తి చేయాల‌ని మ‌హా ఉత్సాహంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.