కేసీఆర్ ప్రెస్ మీట్... ఈ టాపిక్ పై తీవ్ర ఉత్కంఠ

June 03, 2020

నిన్న సడలింపుల అనంతరం వెంటనే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. సోమవారం సాయంత్రం కేబినెట్ బేటీ ఉంటుందని దాని సారాంశం. అసలు విషయం ఏంటంటే... నిన్నటి సడలింపుల్లో కొంత అయోమయం ఉంది. బస్సులు నడపొచ్చు కానీ ఆ అధికారం రాష్ట్రాలకే వదిలేస్తున్నాం అన్నది కేంద్రం ప్రకటన. దీంతో పాటు ఫుడ్ హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. దానిని కేసీఆర్ తెలంగాణలో బ్యాన్ చేశారు.

ఇపుడు ఈ రెండు టాపిక్ లపై తెలంగాణ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అటు ఇటు ప్రయాణించడం కోసం ఎదురుచూస్తున్నారు. అనుమతి లేకపోవడంతో ఏమీ చేయలేక ఊరుకుండిపోయారు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇరు రాష్ట్రాలు బస్సులు నడుపుకునే వెసులు బాటు వస్తుంది. నిర్మాణ రంగం ఓపెన్ చేసినపుడు ఈ బస్సులు కూడా నడిపితేనే దానికి పూర్తి ఉపయోగం. అందువల్ల దీనిపై ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కేబినెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని చెబుతున్నారు. అపుడు ఈ కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. స్విగ్గీ, జొమాటోలను బ్యాన్ చేసినా... స్విగ్గీ ఫుడ్ కాకుండా ఇతర వస్తువుల డెలివరీలోకి దిగడంతో కేసీఆర్ ఉద్దేశం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం వాటికి అనుమతి ఇస్తే... రాష్ట్రానికి కొంత ఆదాయం అయినా వస్తుందన్న ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. 

మరోవైపు హైదరాబాదులో చిక్కుకుపోయిన వారిని ఇంటికి చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం బస్సులు ప్రారంభిస్తానని చెబితే 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఎందుకో 15వ తేదీ ప్రారంభం కావల్సన బస్సులు వాయిదా పడ్డాయి. మరి తెలంగాణ ఏమైనా అడ్డుకుందా అన్నది వెల్లడించలేదు.

ఇపుడు రెండు రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చి అటుఇటు బస్సులు నడుపుతాయా? నడపవా? అన్న ఉత్కంఠ ప్రజల్లో తీవ్రంగా ఉంది. సాయంత్రం కేబినెట్ బేటీలో దీనిపై క్లారిటీ రానుంది. అంతవరకు వేచి చూడకతప్పదు.