కరోనా ఫ్రంట్ లైన్ హీరోస్‌కు 'తత్వ' సాయం

August 03, 2020

కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ సంస్థలు వివిధ రకాలుగా సాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా TATVA (తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రైవ్యాలీ) 500కు పైగా చేతితో కుట్టిన మాస్కులను కాలిఫోర్నియా థౌసంజ్స్ ఓక్స్‌లోని లాస్ రోబ్లెస్ హాస్పిటల్‌లో పంపిణి చేసింది. హాస్పిటల్‌లో మాస్కులకు కొరత ఏర్పడింది. దీంతో స్థానికంగా ఉన్న పలు తెలుగు కుటుంబాలు, తెలుగు మహిళలు ఖాళీ సమయాల్లో పిల్లల సహకారంతో మాస్కులను ఇంటి వద్దే తయారు చేశారు. హాస్పిటల్‌కు మాస్కులు అందించిన తెలుగువారిని, మహిళలను హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు ప్రశంసించారు.

కరోనాపై పోరులో వైద్య రంగం ముందుంది. సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే 'తత్వ' ఈ పోరులో ముందు నిలిచిన వైద్యులకు సాయం అందించింది. హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం వారి విజ్ఞప్తి మేరకు 500కు పైగా మాస్కులు, 45 హెడ్ కవరింగ్స్ తయారు చేసి అందించింది 'తత్వ'. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనులు, పిల్లల ఆన్ లైన్ క్లాస్, నిత్యావసర వస్తువుల ఇబ్బందుల వంటి బిజీ బిజీ సమయంలోను కమ్యూనిటీకి సహకరించేందుకు 'తత్వ' పిలుపు మేరకు స్థానిక తెలుగు మహిళలు ముందుకు వచ్చారు.

500 మాస్కులలో దాదాపు 400 మాస్కులను వారం రోజులలోనే తయారు చేశారు కాలిఫోర్నియా తెలుగింటి మహిళలు. దాతలు ఇచ్చిన 2,000 ాలర్ల విరాళాలతో మరిన్ని మాస్కులు కొనుగోలు చేసింది 'తత్వ'. మార్కెట్‌లో ప్రస్తుతం ఫ్యాబ్రిక్ దొరకడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలోని బెడ్ షీట్స్, తమ కాటన్ చీరలను కూడా మాస్కుల తయారీకి ఉపయోగించారు. ప్రస్తుతం N95 మాస్కుల కొరత ఉందని, ఇలాంటి సమయంలో ఈ మాస్కులు ఎంతో ఉపకరిస్తాయని లాస్ రోబ్లెస్ మెడికల్ సెంటర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి చెందిన డాక్టర్ కార్లో రీయీస్ థ్యాంక్స్ చెప్పారు.

కమ్యూనిటీ కోసం 'తత్వ' ఎప్పుడూ ముందుంటుంది. కష్టకాలంలో కమ్యూనిటీ కోసం పని చేసిన వెంచురా ఫైర్ ఫైటర్స్, ఫస్ట్ రెస్పాండర్స్, సిమివ్వాలి పోలీస్ డిపార్టుమెంట్ తదితరులకు ఆర్థిక సాయం చేసి వారి సేవలకు గాను 'తత్వ' వేదికపై ఘనంగా సత్కరించిన సందర్భాలు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని మాస్కులు తయారు చేసి, తమకు తోచిన సాయం చేసేందుకు సిద్ధమని 'తత్వ' వెల్లడించింది.

హాస్పిటల్ వర్గాలతో శ్రీమతి శిరిషా పొట్లూరి సమన్వయం చేసుకున్నారు. ఆమెకు అనుపమ సీమకుర్తి, బారతి రాజమణి, బిందు పోలవరపు, దుర్గ వలివేటి, హైమ బుద్దిరాజు, కాంచన్, లక్ష్మి, గోతేటి, లక్ష్మి నిస్టాల, లక్ష్మి పడాల, నీలిమ యాదల్ల, శ్రియ పొన్నగంటి, సుహారిత అల్లు, సునిత బొప్పుడి, సునిత మరసకట్ల, తులసి అడప, విజయ కొప్పు, ఆర్థిక సాయం చేసిన దాతలకు 'తత్వ' కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపింది.