త‌త్వ రంగ‌స్థ‌లానికి విశేష స్పంద‌న‌

August 07, 2020

త‌త్వా (తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ ట్రైవ్యాలీ ) ఆధ్వ‌ర్యంలో సిమీవ్యాలీ ప‌ట్టణం, కాలిఫోర్నియాలో ఆగస్టు 3, 2019న నిర్వ‌హించిన రంగ‌స్థ‌లం (ల‌లిత క‌ళ‌ల సాంస్కృతికోత్స‌వం) కార్య‌క్ర‌మంలో ప్ర‌వాసాంధ్రులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు. జాతిపిత మ‌హాత్మ‌గాంధీ 150వ జ‌న్మ‌దినోత్స‌వ సంబురాల‌ను మ‌రియు స్వాంత్రంత్య దినోత్స‌వ వేడుక‌లు ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన ఇతివృత్తంగా తీసుకొని విజ‌య కూన‌పులి గారి నిర్దేశంలో ``తేనెల తేట‌ల మాట‌ల‌తో` ``ఓ బాపూ`` మ‌రియు ``జ‌న‌నీ`` గీతాల‌ను బృంద‌గానంగా ఆల‌పించారు. ఈ గీతాల‌కు అనుసంధానంగా అనేక మంది బాల బాలిక‌లు త‌మ నృత్యంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

``ల‌య డ్యాన్స్ స్కూల్‌`` వారి ``బంటు రీతి కొలువు`` మ‌రియు ``వందేమాత‌రం`` నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆహుతుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ``న‌ట‌రాజ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌``విద్యార్థులు చేసిన ``సుబ్ర‌హ్మ‌ణ్య కౌతువం`` భ‌ర‌త‌నాట్యం అంద‌రినీ త‌న్మ‌యుల‌ను చేసింది. ``నాట్య స‌ర‌స్వ‌తి`` బృందం వారు, డాక్ట‌ర్ స‌ర‌స్వ‌తి ర‌జ‌తేష్ మ‌రియు భాగ్య‌శ్రీ మ‌నోహ‌ర్ ఆధ్వ‌ర్యంలో్ ప్ర‌ద‌ర్శించిన ``విశ్వ‌నాథ‌మృతం`` నృత్య‌రూప‌కం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. క‌ళాత‌ప‌స్వి శ్రీ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి అభిన‌యించి ప‌లు న‌ర్త‌కీమ‌ణులు ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహిత‌నుల చేశారు.

``వైద్య‌మా? పైత్య‌మా`` అనే తెలుగు హాస్య నాటిక ``ఆమ్ర‌ఫ‌ల ప్ర‌హ‌స‌నం`` అనే సంస్కృత హాస్య నాటిక‌లు అందిర్నీ క‌డుపుబ్బా న‌వ్వించాయి. ``ఇంటింటి రామాయ‌ణం`` ``నాట్య సుమాంజ‌లి`` ``జాన‌పద నృత్యం`` కార్య‌క్ర‌మాలు ఉత్సాహంగా గ‌డిపేందుకు తోడ్పాటును అందించాయి. భార‌తీయ క‌ళ‌ల‌ను, తెలుగు భాష‌ను బోధిస్తున్న గురువుల‌ను ``త‌త్వ‌`` వారు ``గురువంద‌నం`` అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ద్వారా స‌త్కరించారు. సాంస్కృతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాల‌బాలిక‌లందరికీ `త‌త్వ‌` నిర్వాహ‌కులు జ్ఞాపిక‌లు అంద‌జేశారు. ``గ్రాండ్ బావ‌ర్చీ`` వారందించిన రుచిక‌ర‌మైన సంపూర్ణ విందు భోజ‌నాన్ని అంద‌రూ ఆనందంగా ఆస్వాదించారు. చివ‌ర‌గా, కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసినందుకు ఆహుతుల‌కు, ప్ర‌ద‌ర్శ‌కుల‌కు, వాలంటీర్ల‌కు మ‌రియు స్పాన్స‌ర్ల‌కు `త‌త్వా`` కార్య‌నిర్వ‌హ‌క‌ స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. త‌త్వా ముఖ్య ఉద్దేశాలు, మాస‌వారీ ఆరోగ్య కార్య‌క్ర‌మాలు, సంఘసేవా కార్య‌క్ర‌మాలు అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డాల‌నే ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.