జాతీయ రాజ‌కీయాల్లో చంద్రుల చోటెక్క‌డ‌!

August 10, 2020

రెండోసారి గెలిచి కేసీఆర్‌.. క‌ర్ణాట‌క‌లో చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు ఇద్ద‌రూ త‌మ‌ను తామే బ‌ల‌వంతులుగా భావించుకున్నారు. అనుకూల మీడియా సైతం ఇద్ద‌రూ జాతీయ‌స్థాయిలో గొప్ప వ్యూహ‌క‌ర్త‌లుగానే చిత్రీక‌రించింది. దీంతో 2019 ఎన్నిక‌ల్లో తాము రాష్ట్ర రాజ‌కీయాల్లో జెండాపాతి.. జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌మ‌నే అభిప్రాయానికి చేరారు. అయితే ఇదంతా అనుకున్నంత తేలిక కాద‌ని.. కేసీఆర్‌కు ఏనాడో అర్ధ‌మైంది. మిగిలింది చంద్ర‌బాబు మాత్ర‌మే. ఆయ‌న‌కూ.. మొన్న ఢిల్లీలో చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌తో ప‌రిస్థితులు అవ‌గ‌త‌మ‌య్యాయి. ఇటువంటి స‌మ‌యంలో ఇద్ద‌రు చంద్రులు.. జాతీయ‌పార్టీల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డ్డారు. మోదీ, రాహుల్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో ఎవ‌రు గెలిస్తే.. తాము ఆ వైపున‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామ‌నే సంకేతాలు పంపుతున్నారు. దీనికి తెలుగు రాష్ట్ర ఎంపీలు ముఖ్య‌మ‌నే ఉద్దేశాన్ని ప‌దేప‌దే వ్య‌క్తం చేస్తున్నారు. రెండు తెలుగు నేల‌ల‌పై ఉన్న 42 ఎంపీ సీట్ల‌తో ఏకంగా కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నేది చంద్రుల ఎత్తుగ‌డ‌. అయితే.. ఈ విష‌యంలో కేసీఆర్ ఓ అడుగు ముందుగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ముందుగానే ముగియ‌టంతో ఆయ‌నుకు కేవ‌లం ఎంపీల‌ను గెలిపించుకోవ‌ట‌మే మిగిలింది. పైగా తెలంగాణ‌లో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేదు. పోటీ నామమాత్ర‌మే అనే భావ‌న‌కు ఆల్రెడీ తీసుకువ‌చ్చారు కేసీఆర్‌. కానీ. ఏపీలో చంద్ర‌బాబుకు ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నాయి. త‌న‌యుడు లోకేష్ గెలుపు రూపంలో కొత్త‌స‌వాల్ కాచుకు కూర్చుంది. విప‌క్షం కూడా రోజురోజుకూ బ‌ల‌ప‌డుతుంది. వ‌ల‌స‌లు పెర‌గ‌టం.. అది కూడా టీడీపీను వీడిపోతున్న‌వారు అధిక‌మ‌వ‌టం కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఊపిరి పీల్చుకోనివ్వ‌ట్లేదు. ఇంట గెల‌వాల్సిన భారం మ‌రింత పెరిగింది. ఇటువంటి స‌వాళ్ల మ‌ధ్య రాష్ట్ర రాజ‌కీయ‌మే త‌ల‌నొప్పిగా మారిన చంద్రులు.. జాతీయ‌స్థాయిలో మ‌మ‌తాబెన‌ర్జీ, మాయావ‌తి, నితీష్‌కుమార్‌, ల‌ల్లూ, మోదీ, సోనియాగాంధీ వంటి త‌ల‌పండిన నేత‌ల‌ను త‌ట్టుకుని.. వారిని మించేలా చ‌క్రం తిప్ప‌గ‌ల‌రా! మూడోకూట‌మితో చంద్రుల హ‌వాను.. హ‌స్తిన‌లో చాట‌గ‌ల‌రా!!