అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం

August 05, 2020

న్యూ యార్క్ :  అమెరికా కు వెళ్లిన తెలుగువారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు.. తమ శక్తి, యుక్తులతో తెలుగువారికి, అమెరికా కు కూడా మంచి పేరు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగమ్మాయి దేవిశ్రీ దొంతినేని అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది.

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పొన్నూరు కు  చెందిన శ్రీనివాస్, అనుపమ ల కుమార్తె దేవీ శ్రీ అమెరికా లోని న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో పుట్టి పెరిగింది. తాను పదవ గ్రేడులో ఉన్నప్పుడు మేరీల్యాండ్ లోని అన్నాపోలిస్ నేవీ అకాడమీ సందర్శనకు వెళ్లింది. అక్కడ నేవల్ అధికారిణిగా తన జీవితంలో సాధించిన విజయాలపై ఓ అధికారిణి ఇచ్చిన ప్రసంగం ఆమెలో స్ఫూర్తిని నింపింది. ఇదే ఆమె నేవీ లో పనిచేయాలనే కలలకు ఊపిరిపోసింది.

అప్పటి నేవీ లో అడ్మిరల్, ఇప్పటి నార్వే అమెరికా రాయబారి కెన్నెత్ బ్రైత్ ‌ వైట్ ను దేవీ శ్రీ తన తల్లిదండ్రులతో పాటు కలిసి తన ఆశయాన్ని వివరించింది. కెన్నెత్ బ్రైత్. దేవీ శ్రీ కి ప్రోత్సాహం అందించడంతో పాటు.. నేవీ లో ఎలా చేరాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. కెన్నెత్ ఇచ్చిన స్ఫూర్తితో  దేవీ శ్రీ ఆ దిశగా కసరత్తు చేసింది. 

2015 వేసవిలో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ (USNA) కు దరఖాస్తు చేసుకుంది. అదే సంవత్సరం డిసెంబర్‌లో అమెరికా నేవీ ఆమె దరఖాస్తు ను ఆమోదించడం జరిగింది. సైన్యంలో అబ్బాయిలను పంపించడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించే తల్లిదండ్రులున్నారు. అలాంటిది అమ్మాయిని పంపించడం ఎలా అని సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులకు దేవీ శ్రీ నే నచ్చచెప్పింది. దేశానికి సేవ చేయాలనే తన సంకల్పానికి సహకరించమని కోరడంతో దేవీ శ్రీ తల్లిదండ్రులు అందుకు సమ్మతించారు. ప్రస్తుతం నేవీ శిక్షణ పూర్తి చేసుకున్న దేవీ శ్రీ దొంతినేని నేవీ ఫైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది. 

ఇది మన తెలుగమ్మాయి సాధించిన విజయం. ఓ తెలుగమ్మాయి అమెరికా లో ఇలాంటి బాధ్యతలు స్వీకరించడం యావత్ తెలువారందరికి గర్వకారణమైన విషయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దేవీ శ్రీ ని ప్రశంసించింది. ఆమె భవిష్యత్తులో తన పదవికి వన్నె తెచ్చేలా ఎన్నో విజయాలు సాధించాలని నాట్స్ అకాంక్షిస్తున్నట్టు తెలిపింది.