తెలుగుభాష చచ్చిపోతోంది... కొంచెం గగ్గోలు పెట్టండయ్యా !

August 06, 2020

2018 లో మునిసిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రవేశపెడుతున్నాం అని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించగానే ఒక సెక్షన్ ఎన్నారైలు చంద్రబాబు మీద విపరీతంగా దాడి చేశారు. ఇంగ్లిష్ మీడియంతోబాటు తెలుగు మీడియం కూడా ఉంటుంది అని చెప్పినా వినిపించుకోలేదు. చంద్రబాబు దిగిపోతే తెలుగు మరుసటిరోజునుండీ ఉజ్జ్వలంగా వెలుగుతుందన్నంతగా శాపనార్ధాలు పెట్టారు. మరి వారందరూ ఎందుకోగానీ పిత్తిన ముత్తైదువల్లగా ఏమీ ఎరగనట్లు ఈ వార్తపట్ల మౌనం నటిస్తున్నారు. కొంచెం నోరెత్తండయ్యా ! మొన్నీ మధ్యనేగా పక్క ఊళ్ళనుండి వచ్చి, డాలస్‌లో ఆంతరంగిక సాహితీ పకోడీ గోష్ఠులు పెట్టి, చంద్రబాబు పోయాడు, ఇక తెలుగు వర్ధిల్లుతుందని చప్పట్లు కొట్టారూ ? రాజకీయాల్లో ఉన్న సాహితీవేత్తలకి పొలిటికల్ కంపల్షన్స్ ఉండి ఉండొచ్చు. ప్రవాసాంధ్రులుగా రాజకీయాలకి మేము దూరం అని రోజూ నీతులు చెప్పే మీకు ఏ కంపల్షన్స్ ఉన్నాయి ? కుల కంపల్షన్సేగా ? మీ అందరి పేర్లూ రాసి మరీ ఏకి పారేయాలని ఉందిగానీ, మీ వయసుని చూసి వదిలేస్తున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు తెలుగు మీడియాన్నే ఎత్తేసింది. ఏడవండి ఇహ.

ఒకపక్క తెలుగు విశ్వవిద్యాలయం, గుమ్మడి గోపాలకృష్ణగారి నాయకత్వంలోని నాటక అకాడెమీ, దీర్ఘాసి విజయభాస్కర్ గారి నాయకత్వంలోని ఏపీ సాంస్కృతిక శాఖ, మండలి బుద్ధప్రసాద్ గారు, సోదరుడు పొట్లూరి హరికృష్ణ, ఎన్‌టీయార్ ట్రస్ట్ సహకారంతో పెద్ద పట్టణాల్లో జరిపిన పుస్తక ప్రదర్శన మహోత్సవాలు, అమరావతి కల్చరల్ సెంటర్ పేరుతో ఈమని శివనాగిరెడ్డిగారు, హరీష్ చంద్రప్రసాద్ గారి వంటి పెద్దలు, సాయి పాపినేని గారు, ఇంకా అనేకమంది వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలో ....నిజానికి గత ఐదేళ్లలో మన ఆంధ్ర భాషాసంస్కృతుల్ని ఉత్తేజపరుచుకునే కృషి కొంత జరిగింది (వీరిలో 90 శాతం మంది కమ్మవారు కాదు). రాష్ట్ర విభజన నేపథ్యంలో, అందరిలోనూ ఆ కోరిక ప్రస్ఫుటించింది.

గతప్రభుత్వం కొంత చేసినా, చేయాల్సింది ఇంకా చాలా ఉందనేది కూడా నిజం. కాకపోతే చంద్రబాబు కమ్మకులం. ఆయనంటే మనకి పడదు. మన కులానికి ఆయన కులానికీ పడదు. మా బాబాయో, మేనమామో అలా నూరిపోశాడు. కాబట్టి వ్యతిరేకించాలి. ఇదే ఎదవ నస. కనీసం ఇప్పుడైనా ఆ కులం యాంగిల్ వదిలేసి, కొంచెం గొంతెత్తి, ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం రెండూ కొనసాగించమని ప్రభుత్వానికి చెప్పండి. కనీసం ఒక పోస్ట్ రాసి ఏడవండి ఫేస్‌బుక్‌లో. రచయితలు, సాహితీవేత్తలు, సాహితీపోషకులు, ప్రవాసాంధ్రులుగా లబ్ధప్రతిష్టులూ అని స్వకుచమర్ధనమే తప్ప మీవల్ల అంతకన్నా పావలా ఉపయోగం లేదు తెలుగుభాషకి. మీకంటే ఆ "మనబడి", "పాఠశాల", హిందూదేవాలయాల్లో తెలుగు నేర్పించే వలంటీర్లు, నేర్చుకునే పిల్లలు వేలరెట్లు గొప్పవాళ్ళైన భాషాసేవకులు.

కేసి చేకూరి

పొలిటికల్ ఎనలిస్ట్