తెలుగు కుర్రాడిని అరెస్ట్ చేసిన పాకిస్తాన్

June 01, 2020

సరైన పత్రాలు లేకుండా తమ దేశంలోకి అడుగుపెట్టారంటూ ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. వారిలో ఒక యువకుడు హైదరాబాద్‌కు చెందినవ్యక్తి కాగా మరొకరు మధ్యప్రదేశ్ వాసి. ప్రశాంత్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీరు. పాస్ పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్లో అడుగుపెట్టిన ప్రశాంత్ ను, మధ్యప్రదేశ్ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హైదరాబాదులోని ప్రశాంత్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ప్రశాంత్‌ను విడిపించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాలను కుటుంబసభ్యులు కోరారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన వీడియో విడుదలైంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. పోలీసు స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇస్తారు. బెయిల్ వస్తే మీతో మాట్లాడవచ్చు. మరో నెల రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది … అని వీడియోలో ప్రశాంత్ చెప్పాడు.
ప్రశాంత్ ఆన్‌లైన్‌లో పరిచయమైన ప్రియురాలి కోసం పాక్ సరిహద్దుల వరకు వెళ్లి పొరపాటున బోర్డర్ దాటాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే, భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీరి విడుదల ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది.