తెలుగు మీడియా మిస్సయిన అసలు పాయింట్

April 03, 2020

ఒకరి తప్పును వేలెత్తి చూపించేటప్పుడు అస్సలు తప్పు చేయకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. అలాంటప్పుడు ప్రధాన మీడియా సంస్థ మిస్టేక్ చేసిందన్న విషయానికి బ్లండర్ మిస్టేక్ అనే శీర్షిక ఎలా పెడతారన్న ప్రశ్న కొందరు వేయొచ్చు. ఇప్పుడు అదే విషయాన్ని మేం చెప్పనున్నాం. నిజమే.. బ్లండర్ మిస్టేక్ అనే పదమే లేదు. కానీ.. చాలామంది మిస్టేక్ ను చాలా బలంగా చెప్పేందుకు తెలిసీ తెలియనితనంతో బ్లండర్ మిస్టేక్ అని చెప్పటం ద్వారా.. దారుణమైన తప్పు చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేం చేసింది కూడా అదే.
తెలుగు మీడియాకు సంబంధించి ప్రధాన సంస్థలు ఈ రోజో దారుణమైన తప్పు చేయటం షాకింగ్ గా మారుతుంది. ఈ సందర్భంగా ప్రధాన మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులలో చాలామందికి బుర్రలో గుజ్జు లేదా? అన్న సందేహం కలుగక మానదు. తెలుగు మీడియాకు సంబంధించి.. అందునా ప్రింట్ వరకూ వస్తే.. ఈనాడు.. సాక్షి.. ఆంధ్రజ్యోతి.. నమస్తే తెలంగాణలను చెప్పొచ్చు. మిగిలిన వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే కానీ.. అవి చూపించే ప్రభావం అంతంతే.
ప్రధాన మీడియా సంస్థలుగా (ప్రింట్) పరిగణించే వాటిల్లో ఆంధ్రజ్యోతి తప్పించి.. మిగిలిన అన్ని మీడియా సంస్థలు ఆర్టికల్ 370 రద్దు అయినట్లుగా పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించాయి. దీనికి మించిన బ్లండర్ మరొకటి లేదు. ఎందుకంటే.. ఆర్టికల్ 370 రద్దు కాలేదు. కేవలం వాటికి కొన్ని సవరణలు చేశారంతే. ఈ చిన్న పాయింట్ ను ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాని పరిస్థితి. ఒక ప్రధాన వార్తకు సంబంధించి అత్యంత కీలక మైన అంశం విషయంలో జరిగిన పొరపాటు కారణంగా.. తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లటం ఖాయం. ఎందుకిలా జరిగింది? భారీ ప్రాధాన్యత ఉన్న ఐటెమ్ ను అత్యంత సీనియర్ల పర్యవేక్షణలో రాయిస్తారు. దానిని.. అందరూ చదివి ఓకే చేస్తుంటారు.
అలాంటిది అన్ని ప్రధాన తెలుగు మీడియా సంస్థలు (ఆంధ్రజ్యోతి మినహాయించి) కూడబల్కున్నట్లుగా భారీ తప్పు చేయటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. కశ్మీరీ అంశాలకు సంబంధించి టీవీల్లో వచ్చిన స్క్రోలింగ్స్ ప్రభావం వారి మదిలో పడి ఉండి ఉంటుంది. దీనికి తోడు.. ఏం జరిగిందన్న విషయంపై మీడియా హౌస్ లోని టాప్ ఆర్డర్ లో ఉన్న వారిలో అవగాహన మిస్ కావటం వల్ల కూడా ఈ బ్లండర్ మిస్టక్ (!) దొర్లి ఉండొచ్చు. ఏమైనా.. తెలుగు పాఠకులందరికి కశ్మీర్ కు సంబంధించి అత్యంత కీలకమైన అంశానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా ప్రధాన మీడియా సంస్థలు వ్యవహరించాయని చెప్పక తప్పదు. మరి.. ఈ తప్పును సవరణతో అయినా కవర్ చేసే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.