అమరావతి కోసం ఎన్నారైల మరో ప్రయత్నం

August 14, 2020

ఒక ప్రతీకారం, ఒక కక్ష, ఒక మూర్ఖపు ఆలోచన... ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు చీకటి తెరలను కప్పుతోంది. మార్గదర్శకుల హోదాలో ఉన్న వారే ఆంధ్రను చీకటిలోకి నెడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆంధ్రుడు కన్నీరు పెడుతున్నారు. వెళ్లకూడని చేతికి అధికారం వెళ్తే వ్యవస్థలు కూడా పతనాన్ని ఆపలేవు అన్నదానికి ప్రత్యక్ష సాక్షి ఈనాటి ఏపీ అసెంబ్లీ. అమరావతి మార్పు రాష్ట్రానికే కాదు, దేశానికే తప్పుడు దారిని చూపే ప్రమాదకరమైన నిర్ణయం. దీనిని ఎన్నారైలు తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. నిరసనను పట్టించుకోని పాలకులపై ఎన్నారైలు సరికొత్త రూపంలో ఉద్యమిస్తున్నారు. 

ఆరు దశాబ్దాలుగా ఆంధ్ర నుంచి అమెరికాకు వలసపోయి అక్కడ స్థిరపడిన పలువురు తెలుగు వారు తమలో ఒకరైన జయరాం కోమటి నేతృత్వంలో  శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్  సంజయ్ పాండాను కలిశారు. అమరావతిలో జరుగుతున్న ఘోరాలను, ప్రభుత్వాలను నమ్మి తమ భూములు ఇచ్చినందుకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి బే ఏరియా నుంచి అమరావతి రైతుల తరఫున వీరంతా పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివెళ్లారు. సుమారు నాలుగు పెద్ద వాహనాల్లో వందలాది మంది కాన్సుల్ జనరల్ అపాయింట్మెంట్ తీసుకుని అమరావతి పరిస్థితి వివరించారు. ఈ కాన్సుల్ జనరల్ ద్వారా అమరావతి రైతుల బాధను, ఆవేదనను... ప్రభుత్వ నిర్ణయం వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ఒక మెమొరాండం తయారుచేశారు. దీనిని కాన్సుల్ జనరల్ ద్వారా రాష్ట్రపతికి పంపారు.  

అమరావతిలో ఆడవారిపై పిల్లలపై వృద్ధులపై ప్రభుత్వం పోలీసులతో దమనకాండకు పాల్పడుతోంది. వారు చేసిన తప్పు రాజధాని నిర్మాణానికి కానీ ఖర్చులేకుండా భూములు ఇచ్చేయడం. పోనీ ఇచ్చిన భూమికి పరిహారం రాదు. ఇచ్చిన మొత్తం తిరిగి కూడా రాదు. రూపాయి భూమి ఇస్తే కేవలం పావలా భూమి మాత్రమే తిరిగి వస్తుంది. అయినా... వారు మా విలువ మాకు వస్తుంది... రాష్ట్రానికి మార్గం చూపిన వాళ్లం అవుతామని త్యాగాలకు సిద్ధమైతే వారి తలరాతలను, రాష్ట్ర భవిష్యత్తును చిదిమివేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని, ఇందులో జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయమని వారు రాష్ట్రపతికి ఇచ్చిన మెమొరాండంలో కోరారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 

కొసమెరుపు : అమెరికాలో చిరపరిచితమైన, కోట్ల గొంతుకలకు ప్రతినిధిగా నిలిచిన మానవ హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి రోజే అమరావతి రైతుల హక్కుల గురించి ఇండియన్ కాన్సులేట్ కు నివేదించడం గమనార్హం.