కాశ్మీర్ విభజనలో తెలుగోడి హ్యాండ్

July 13, 2020

ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసంల జల్లు కురుస్తోంది. ఇంతటి సంచలనంగా మారిన ఈ నిర్ణయం గెజిట్ రూపం దాల్చడంలో తెలుగు అధికారి కీలక పాత్ర పోషించారు. న్యాయ శాఖలో లెజిస్లేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్న తెలుగు అధికారి డి.నారాయణరాజు దీన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2015 నుంచి న్యాయశాఖలో లెజిస్లేటివ్ సెక్రటరీగా ఉన్న ఆయన చేతినుంచే కేంద్రం తీసుకొచ్చే బిల్లుల ముసాయిదాలన్నీ సభ వరకు వస్తాయి. న్యాయవ్యవహారాలలో విశేష అనుభవం ఉన్న ఆయన కేంద్రం చెప్పిన పనిని బయటకు పొక్కకుండా, న్యాయపరంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా రూపొందించడంలో దిట్ట.
కాగా.. ఆర్టికల్ 370ని రూపొందించింది మన పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన అధికారి. కాశ్మీర్‌కు ఒకప్పుడు ప్రీమియర్‌గా వ్యవహరించిన తమి ళనాడుకు చెందిన ఐఏఎస్‌ అధికారి గోపాలస్వామి అయ్యంగార్‌ ఈ వివాదాస్పద ఆర్టికల్‌ను స్వయంగా రూపొందించారు.
తమిళనాడులోని తంజా వూరుకు చెందిన దివాన్‌ బహదూర్‌ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్‌ ఐఏఎస్‌ పూర్తి చేసి 1905లో మద్రాస్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 1919లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. బ్రిటిష్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను 1937-43 మధ్య కాలంలో కశ్మీర్‌ ప్రధానిగా నియమించారు. ఆ తరువాత 1943-47వరకు మంత్రిగా సేవలందించారు. భారత దేశానికి స్వాతంత్య్రం రాగానే తొలి ప్రధాని నెహ్రూ మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించారు. ఏ పోర్ట్‌పోలియో కేటాయించకపోయినప్పటికీ కశ్మీర్‌ వ్యవహారాలను పర్య వేక్షించే అధికారం ఇచ్చారు. 1946లోరాజ్యాంగ ముసాయిదా తయారీ బృందంలో ఆయనకు చోటు దక్కింది. కశ్మీర్‌ వ్యవహారాల్లో ఆయన అను భవం, పట్టును గుర్తించి ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు రాజ్యాంగంలో ఆర్టికల్‌ రాసే పనిని అప్పగించారు. దాంతో ఆయన 370 ఆర్టికల్‌ను రూపొందించారు. 1952లో జెనీవాలో జరిగిన కశ్మీర్‌ చర్చల్లోనూ భారత్‌ తరపున ఆయనే పాల్గొన్నారు.
మొత్తానికి భారతదేశానికి ఉత్తరకొనన ఉన్న కశ్మీర్‌కు సంబంధించిన కీలక ఆర్టికల్ 370ని.. దాని రద్దు గెజిట్‌ను దేశానికి దక్షిణాదికి చెందినవారు రూపొందించడం విశేషం.