ఇండస్ట్రీలో ఇద్దరు - వార్ వన్ సైడ్

May 31, 2020

సంక్రాంతికి రాబోయే ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల మధ్య ప్రతి విషయంలోనూ పోటీ కనిపిస్తోంది. ఇందులో హీరోలిద్దరూ టాప్ లీగ్ స్టార్లు కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. ప్రతి విషయంలోనూ పరస్పరం పోల్చి చూడటం.. మా సినిమా గొప్పంటే మా సినిమా గొప్ప అని ఫ్యాన్స్ వాదులాడుకోవడం చూస్తున్నాం. ఈ సినిమాలకు సంగీతం అందిస్తున్న తమన్, దేవిశ్రీ ఇద్దరూ కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు. ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా రసవత్తర పోటీ నడుస్తోంది. ఐతే చాలా ఏళ్లు దేవిశ్రీ ప్రసాదే.. తమన్ మీద ఆధిపత్యం చలాయించాడు. కానీ ఇప్పుడు తమన్ టైం నడుస్తోంది. దేవిశ్రీ ఆశ్చర్యకరంగా టచ్ కోల్పోయి రొటీన్ పాటలతో విసుగెత్తించేస్తున్నాడు. తమన్ మాత్రం రొటీన్ బాట వీడి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని మంచి పాటలు ఇస్తున్నాడు.

‘అల వైకుంఠపురములో’ నుంచి ‘సామజ వరగమన’.. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి టైటిల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి రెండు చిత్రాల పాటల్ని పోల్చి చూస్తూ వస్తున్నారు సంగీత ప్రియులు. ప్రతిసారీ తమన్‌దే పైచేయి అవుతోంది. అతడికి ప్రశంసలు దక్కుతున్నాయి. దేవిశ్రీని మాత్రం అందరూ ట్రోల్ చేస్తున్నారు. కొత్త పాట రిలీజవుతున్న ప్రతిసారీ ఇదైనా బాగుంటుందా అని మహేష్ అభిమానులు చూడటం.. తీరా రిలీజయ్యాక నిట్టూర్చడం.. ఇదీ వరస. ఇప్పటిదాకా వచ్చిన నాలుగు పాటల పరిస్థితీ అంతే. మరోవైపు ‘అల..’లో చూస్తే అన్ని పాటలకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘ఓ మై గాడ్..’ కొంచెం వీక్ అనిపించినా.. ‘సరిలేరు..’ పాటలతో పోలిస్తే అది కూడా మెరుగే. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘బుట్టబొమ్మ’ పాట ఇన్‌స్టంట్ హిట్టయింది. ఇదే సమయంలో ‘సరిలేరు..’ యాంథమ్ మామూలుగా అనిపిస్తోంది. దీంతో మ్యూజిక్ పరంగా అయితే వార్ వన్ సైడ్ అన్నది తేలిపోయింది. దేవి మీద తమన్‌ది స్పష్టమైన పైచేయి అనడంలో సందేహం లేదు. ‘సరిలేరు..’ నుంచి రాబోయే మిగతా పాటల మీద ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నట్లే ఉన్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్లో కూడా ఏమాత్రం మెరుపులంటాయన్నది సందేహమే. మరి కంటెంట్ పరంగా ఏ సినిమా ఎలా ఉంటుందన్నదే చూడాలిక.