బాబు ఐడియాస్ కు నీతి అయోగ్ ఫిదా... ఇదిగో లేఖ

August 07, 2020

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సుధీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నేత. 40 ఏళ్ల పాటు అలుపెరగని రాజకీయం నెరపుతున్న చంద్రబాబు... 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా, మరింత కాలం పాటు మంత్రిగా పాలనాపర విధాన నిర్ణయాల్లో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవంతోనే తనదైన శైలి విజన్ ను అమలు చేసిన చంద్రబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే వైరివర్గాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుపై ఓ రేంజిలో విమర్శలు చేస్తున్న వైనం మనకు తెలిసిందే. ఆ విమర్శలన్నింటికీ చెంపపెట్టులా ఓ లేఖ నిలిచిందని చెప్పాలి. చంద్రబాబు విజన్ ఏ రేంజో తెలుపుతూ... నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ శుక్రవారం నేరుగా చంద్రబాబుకే లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు తెలుగు నేల రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రాణాంతక వైరస్ కరోనా కట్టడిలో ఏపీలోని జగన్ సర్కారు తనదైన శైలి దుందుడుకు, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే తాను అధికారంలో లేను కదా అని చంద్రబాబు... జగన్ సర్కారు దుందుడుక వైఖరిని చూస్తూ ఊరుకోలేదు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి గత నెల 19 ఓ లేఖ రాశారు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయాలంటే ఏం చేయాలి? అంతిమంగా కరోనాను రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి ఎలా పారదోలాలి? అన్న విషయాలను ప్రస్తావిస్తూ ఓ సుధీర్ఘ లేఖనే చంద్రబాబు రాశారు. ఈ లేఖలో ఉన్న అంశాలను చూసిన ప్రదానమంత్రిత్వ కార్యాలయం సదరు లేఖను నీతి ఆయోగ్ కు పంపింది. ఈ లేఖను చూసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నిజంగానే అచ్చెరువొందారని చెప్పాలి.

చంద్రబాబు రాసిన లేఖలోని కీలకాంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన రాజీవ్ కుమార్... చంద్రబాబు విజన్ ఎంత గొప్పదన్న విషయాన్ని గుర్తించారు. వెనువెంటనే చంద్రబాబుకు లేఖ రాసేందుకు సిద్ధమైన ఆయన... లేఖలో చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు ఎంతటి కీలమమైనవోనన్న విషయాన్ని కూడా రాజీవ్ కుమార్ ప్రస్తావించారు. కంటైన మెంట్ల జోన్ల గుర్తింపు, వాటిలో ఎలాంటి నిబంధనలను పాటించాలి? ఆయా చర్యల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? తదితర అంశాలను చంద్రబాబు ప్రస్తావించిన విషయాన్ని రాజీవ్ కుమార్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ ఫార్మేషన్ వ్యవస్థాపక చైర్మన్ హోదాలో... ఆ సంస్థ తరఫున ఏ మేర డేటాను సేకరించారో; ఆ డేటాను ఎలా విశ్లేషించారన్న విషయాలను ప్రస్తావించిన రాజీవ్... చంద్రబాబులోని విజన్ తోనే అది సాధ్యమైందని తెలిపారు. అంతేకాకుండా సదరు డేటాతో చంద్రబాబు సూచించిన పలు సలహాలు ఏ మేర సత్ఫలితాలనిస్తాయన్న విషయాన్ని కూడా రాజీవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు సూచనలు దేశం నుంచి కరోనాను పారదోలేందుకు ఏ మేర సహాయపడతాయన్న విషయాన్ని చెబుతూనే... సదరు అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు వద్దకు నీతి ఆయోగ్ బృందాన్ని కూడా పంపుతున్నట్లుగా కూడా రాజీవ్ పేర్కొనడం గమనార్హం. మొత్తంగా కీలక విపత్తు వేళ. చంద్రబాబు విజన్ ఏపాటితో, ఆ విజన్ తో ఏ మేర సత్ఫలితాలు సాధించవచ్చన్న విషయాన్ని రాజీవ్ చెప్పకనే చెప్పేశారు.