వాళ్లు ఉత్తములు.. తప్పంతా సోషల్ మీడియాదే

May 25, 2020

సంక్రాంతి సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపుములో’ రిలీజ్ డేట్ల విషయంలో ఎంత డ్రామా నడిచిందో తెలిసిందే. మూడు నెలల నుంచి ఈ పితలాటకం నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా ఒకే రోజుకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం.. రెండు నెలల పాటు ఈ డేట్లకే కట్టుబడి సాగడం.. తర్వాత ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చి.. ‘సరిలేరు..’ జనవరి 11న, ‘అల..’ 12న వచ్చేలా రాజీ కుదర్చడం తెలిసిందే. అంతటితో ఈ డ్రామాకు తెరపడిందనుకుంటే.. వారం కిందట కథ మలుపు తిరిగింది. ‘అల..’ను 10కి ప్రిపోన్ చేయాలనుకోవడంతో మళ్లీ డ్రామా మొదలైంది. వాళ్లు ముందుకొస్తే తాము కూడా డేట్ మారుస్తామంటూ ‘సరిలేరు..’ టీం పంతం పట్టుకుంది. దీంతో ప్రతిష్ఠంభన నెలకొని.. వారం పాటు డ్రామా నడిచింది. చివరికి చర్చోపచర్చల తర్వాత ముందు అనుకున్న ప్రకారమే 11, 12 తేదీల్లో ఈ సినిమాలు రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఐతే ఈ రాజీ చర్చల్లో కీలకంగా ఉన్న దిల్ రాజు దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఇది చాలా చిన్న విషయం అన్నట్లు మాట్లాడాడు. సోషల్ మీడియాలో రకరకాల రూమర్లొస్తున్నాయంటూ రిలీజ్ డేట్ల కన్ఫ్యూజన్, డ్రామా విషయంలో తప్పంతా నెటిజన్లదే అన్నట్లు మాట్లాడాడు. ఒకసారి ప్రొడ్యూసర్స్ గిల్డ్ రాజీ కుదిర్చాక మళ్లీ ఈ సమస్య ఎందుకు వచ్చిందని అడిగితే.. దాని మీద మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ఇద్దరు హీరోలు ఇగోకు వెళ్లడం.. ఒక దశలో ఇది తీవ్రమైన సమస్యగా మారడం.. గిల్డ్ పెద్దల మాటను కూడా లెక్కచేయకపోవడం గురించి మాట్లాడటానికి రాజు ఇష్టపడలేదు. మేం లోతుల్లోకి వెళ్లం అంటూ.. చిన్న మిస్ అండర్ స్టాండింగ్‌ అంటూ హీరోల ఇగో క్లాష్‌ను కప్పి పుచ్చే ప్రయత్నం చేశాడు రాజు. ఆయనతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న మరో సీనియర్ నిర్మాత దామోదర్ ప్రసాద్ సైతం అదే తరహాలో మాట్లాడాడు. మీడియా, సోషల్ మీడియా మీద కొంత నెగెటివ్‌గా మాట్లాడారు. మొత్తానికి రిలీజ్ డేట్లు లేకుండా పోస్టర్లు వదిలి డ్రామాకు తెరతీసిన ఇరు చిత్ర బృందాలదీ తప్పేమీ లేదన్నట్లు.. మొత్తం పాపమంతా మీడియాది, నెటిజన్లదే అన్నట్లు రాజు అండ్ కో మాట్లాడటమే విడ్డూరం.