ఇండియాలో ఆస్కార్ అధ్యక్షుడు - ఏమన్నారో తెలుసా?

July 09, 2020

భారతీయ సినిమా ఓ పెద్ద తప్పు చేస్తోంది. ఆ విషయం ఎవరు గుర్తించారో తెలుసా... ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ. ఆయన ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్ భారతీయ సినిమా కళ్లు తెరిపించేలా ఉంది. మనం ఏం వదిలేశామన్న విషయాన్ని చాలా సూటిగా చెప్పారు.
గత కొన్నేళ్లలో విలువల పరంగా ఏమో గాని ఆదరణ పరంగా భారతీయ సినిమా ఎంతో ఎదిగింది. ప్రపంచ స్థాయిని అందుకుంది. టెక్నికల్‌గా కూడా మన సినిమా ప్రమాణాలు ఎంతో పెరిగాయి. అయితే... ఈ హడావుడిలో పడి అత్యంత కీలకమైన విషయాన్ని బాలీవుడ్ మరిచిపోయింది. ఈ విషయాన్ని ఆస్కార్ అధ్యక్షుడు మన ఇండియాకు వచ్చి చెప్పడం మనకు కనువిప్పు. ఆయన ఏమన్నారంటే... ‘‘నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. దీనికి కారణం భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు నిలయం. కానీ మాకు బాలీవుడ్‌ నుంచి విడుదలయ్యే మ్యూజికల్‌ సినిమాల ద్వారానే భారతీయ చిత్రాల గురించి తెలిసింది. కానీ వాటిలో భారతీయ ఆత్మ లేదు. భారత సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించడంలేదు. అందువల్ల భారతీయ సినిమా గురించి ఏమీ తెలియడం లేదు. అది మీ తప్పు. ఎందుకంటే.. ప్రపంచానికి మీ విలువను, సంస్కృతిని తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత మీది. అలాంటి సినిమాలకే ప్రాధాన్యం ఉందన్న విషయం మీరు గుర్తించాలి’’ ఆయన ముఖం మీద చెప్పేశారు. వాస్తవానికి ఆయన చెప్పిన మాట చాలా గొప్పది. అసలు మనం ప్రపంచ స్థాయి అంటే టెక్నికల్ గా చూడాలి. కానీ మనం ప్రపంచ కథల మీద దృష్టి పెట్టి మన కథలను వదిలేస్తున్నారు. అవతార్ సినిమా మన కథలోంచి పుట్టింది. వాళ్ల సూపర్ హీరోల సినిమాలు మన కథల్లోంచే పుట్టాయి. కానీ మన వద్ద ఉన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం.
జాన్ బెయిలీ సతీమణి కరోల్‌తో కలిసి శనివారం భారత్‌ లోని ముంబై వచ్చారు. ముంబయిలో ఆస్కార్స్‌ అకాడమీకి సంబంధించిన ఓ శాఖను నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ‘‘ భారత్‌లో ఆస్కార్స్‌ అకాడమీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి బలమైన కారణం ఉంది. ప్రపంచంలో ఎక్కువ సినిమాలు పుట్టేది ఇండియాలోనే. హాలీవుడ్లో ఏడాదికి కేవలం నాలుగైదు వందల సినిమాలే వస్తాయి. కానీ ఏటా భారత్‌లో 1800 సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆస్కార్స్‌ అకాడమీ అంటే హాలీవుడ్ సినిమా అవార్డుల సంఘం కాదని గుర్తుంచుకోండి. అది ప్రపంచ సినిమా టాలెంట్ ను గుర్తించే వేదిక. అందుకే ఇంత పెద్ద సినిమా మార్కెట్ ఉన్నపుడు ఇక్క శాఖ ఏర్పాటుచేయడం మంచి ఐడియా’’ అని జాన్ బెయిలీ అన్నారు.