ట్రంప్ పై ఆవుల ఆత్మలు పగ బట్టాయట

August 09, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ట్రంప్ టూర్ పై భారత మీడియాలో కోకొల్లలుగా కథనాలు వచ్చాయి. ట్రంప్ తినే ఫుడ్ మొదలుకొని ట్రంప్ భార్య మెలానియా డ్రెస్ వరకు అన్నీ హాట్ టాపిక్ అయ్యాయి. దాదాపుగా అమెరికా మీడియాలోనూ ట్రంప్ టూర్ అప్డేట్స్ కొద్దిగా అటుఇటుగా అంతే ఉన్నాయి. అయితే, ట్రంప్ ఇండియా టూర్ పై `ది డైలీ షో విత్ ట్రెవర్ నోహ్`లో సెటైర్లు పేలాయి. ట్రంప్ టూర్ పై ఆ షో వ్యాఖ్యాత నోహ్...తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో వేసిన పంచ్ లు నవ్వులు పూయించాయి. ట్రంప్ టూర్ పై నోహ్ చేసిన షో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్రంప్, మోడీ కౌగిలింతలు ...షేక్ హ్యాండ్లతో వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని సెటైర్ వేసిన నోహ్......ట్రంప్ ను చూసేందుకు 70లక్షల మంది వస్తారని చెప్పాడాన్ని ఎద్దేవా చేశారు. యాంటీ ముస్లిం.. యాంటీ టెర్రరిజాన్ని ట్రంప్ బలపరుస్తారని, అందుకే ఇండియన్స్ కు ట్రంప్ అంటే ఇష్టం అనుకుంటే పొరబడినట్లేనని నోహ్ అన్నారు. టీకా మసాలా లా ట్రంప్ స్కిన్ ఉంటుందని అందుకే ట్రంప్ అంటే భారతీయులకు ఇష్టమని పంచ్ వేశాడు. ఇక, ట్రంప్ కోసమే...కొత్త రోడ్లు, మెరుగులు దిద్దారని...స్లమ్ ఏరియాలు కనిపించకుండా అహ్మదాబాద్లో గోడ కట్టారని ఎద్దేవా చేశాడు. అయితే, ఆ గోడ ట్రంప్ నకు నచ్చుతుందని, ఆ గోడను మెక్సికన్ గోడతో ట్రంప్ పోల్చుకుంటారని సెటైర్ వేశారు.

నాన్ వెజ్, బీఫ్ పెట్టలేదని భారత్ పై ట్రంప్ గుర్రుగా ఉన్నారని నోహ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటివరకు వెజ్ తినని ట్రంప్ భారత్లో శాకాహార భోజనం ఎలా తిన్నారో భగవంతుడికే తెలియాలని సెటైర్ వేశారు. భారత్ లో గోవులు రోడ్లపై తిరుగుతున్నాయని,....వాటిని చూసిన ట్రంప్ ...తాను తిన్న ఆవులన్నీ ఆత్మలై...తనను భారత్ లో వెంటాడుతున్నాయని ట్రంప్ భయపడి క్షమాపణలు చెప్పి ఉంటారని ఎద్దేవా చేశాడు. ఇక హిందీ రాక ట్రంప్ పడ్డ పాట్లను చెబుతూ నోహ్ కడుపుబ్బా నవ్వించాడు. అమ్మబాద్..నముస్తే....చుయ్వాలా.. ఆష్రమ్....సుచిన్....దువాలి...గుజురాత్...స్వామి వివేకమానందా...అంటూ ట్రంప్ హిందీని ఖూనీ చేసిన వైనాన్ని చెబుతూ నవ్వించాడు. ఆ పదాలు పలికేటపుడు ట్రంప్ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ నవ్వించాయని, బహుశా ఈ పదేళ్లలో ట్రంప్ ఎన్నడూ అలా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి ఉండరని ఎద్దేవా చేశాడు. ట్రంప్ పై ఇండియన్ నెటిజన్లు సెటైర్లు వేయవద్దని, ఎందుకంటే ఆయనకు హిందీ నే కాదు ఇంగ్లిష్ కూడా పలకడం రాదంటూ కామెడీ చేశాడు.