వాళ్ల పదేళ్ల కష్టాన్ని పవన్ ఖాతాలో వేస్తున్నారు

July 08, 2020

‘‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’’ దీని గురించి సాధారణ జనాలకు తెలియకపోవచ్చు కానీ, డ్యాన్సర్స్‌కు మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న గొప్ప డ్యాన్స్ టీమ్‌లను వెతికి పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ షోను ప్రారంభించారు. హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ లోపేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. తాజాగా దానితో కలిపి ఇప్పటికి మూడు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో భారతదేశానికి చెందిన ‘‘కింగ్స్‌ యునైటెడ్‌’’ టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలేలో ఈ టీమ్ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌ సింగ్’ సినిమాలోని ‘వాడెవడన్నా.. వీడెవడన్నా’ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ ప్రదర్శనకు న్యాయనిర్ణేతలు జెన్సీఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరెక్‌ హూగ్‌ మూడు వందల పాయింట్లు ఇచ్చారు. ఫలితంగా ‘‘ది కింగ్స్’’ విజేతగా నిలిచింది.

ముంబయి సమీపంలోని నాలాసోపర ప్రాంతానికి చెందిన 14 మంది హిప్ హాఫ్ డ్యాన్సర్లు ‘‘కింగ్స్‌ యునైటెడ్‌’’ను 2009లో ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌ ఏర్పాటులో సురేష్‌ ముకుంద్‌, వెర్నన్‌ మోంట్రియో ముఖ్య భూమిక పోషించారు. ఈ టీమ్ ఏర్పడిన తొలినాళ్లలో అంతగా గుర్తింపు పొందలేదు. అందుకే ఊళ్లల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరయ్యేవారు. తక్కువ ఫ్రైజ్‌మనీ ఉన్నా పోటీ చేసేవారు. ఇలా రియాలిటీ షోలలో పాల్గొనడానికి సరిపోయే డబ్బును సంపాదించారు. ఆ తర్వాత భారతదేశంలో ఎక్కడ పోటీలు జరిగినా ఈ టీమ్ పాల్గొనేది. మొదటిసారి ఈ టీమ్ గురించి తెలిసింది మాత్రం 2011లో. ఆ సంవత్సరం జరిగిన ‘‘టాలెంట్ సీజన్ 3’’ టైటిల్ నెగ్గడం ద్వారా ‘‘కింగ్స్‌ యునైటెడ్‌’’ గురించి అందరికీ తెలిసింది. అప్పుడే ఈ టీమ్‌కు చాలా మంది అభిమానులైపోయారు.

ఆ తర్వాతి సంవత్సరంలోనే కింగ్స్ ‘‘వరల్డ్‌ హిప్‌ హాప్‌ ఛాంపియన్స్‌’’లో ఫైనల్‌కు చేరినా.. తుది మూడు జట్లలో చోటు సంపాదించలేకపోయింది. కానీ, 2015లో మాత్రం మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కూడా పలు దేశవాళీ పోటీల్లో విజేతగా నిలిచింది. తాజాగా ‘‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’’ టైటిల్ నెగ్గి అబ్బురపరిచింది. ఇలా పదేళ్లు నానా కష్టాలు పడి ప్రపంచానికి తెలిసిన ‘‘కింగ్స్‌ యునైటెడ్‌’’ టీమ్ కష్టాన్ని పవన్ అభిమానులు ఆయన ఖాతాలో వేయడం విడ్డూరమనే చెప్పాలి. ఫినాలేలో పవన్ సినిమా పాటను ప్రదర్శించినంత మాత్రాన ఆయన అభిమానులు ఎందుకింత యాగి చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనిపై చాలా మంది డ్యాన్స్ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజమే మరి.. పదేళ్ల పాటు ఎంతో శ్రమించి విజయం సాధిస్తే వాళ్ల కష్టాన్ని గుర్తించకుండా తమ అభిమాన హీరో గొప్పదనంగా భావించే ఫ్యాన్స్.. వాళ్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.