కేంద్ర మంత్రి అబద్ధం తెగ వైరల్ అయ్యింది

July 10, 2020

తెలుగు రాష్ట్రాల కొత్త గవర్నర్ సుష్మా స్వరాజ్ అని నిన్న ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. ఇటీవలి వరుస పరిణామాలు, నిన్నటి కేంద్ర మంత్రి ట్వీట్ చూసి అందరూ నిజం అని అనుకున్నారు. తీరాచూస్తే అది నిజం కాదని తేలింది. దీని వెనుక పెద్ద కథే నడించింది. స్వయంగా మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ వార్తలను ఖండించారు. నేను గవర్నర్ గా చేస్తున్న ప్రచారం తప్పు అని ఆమె కొట్టిపారేశారు.

ఇదిలా ఉంటే.. ఈ గాసిప్ రావడానికి కారణం, అసలు దానిని సృష్టించింది కేంద్ర మంత్రి గారే. చివరకు నాలిక్కరుచుకుని ఆ ట్వీట్ తొలగించారు. సోమవారం ఏపీకి కొత్త గవర్నర్ వస్తుందని కొందరు, తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తుందని కొందరు వార్తలు రాశారు. జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది. దీనికి ఒక ట్వీట్ కారణం.
’’ఏపీ గవర్నర్ గా అపాయింట్ అయినందుకు మీకు శుభాకాంక్షలు సుష్మాస్వరాజ్ జీ‘‘ అంటూ కేంద్ర మంత్రి హర్షవర్దన్ ట్వీట్ చేశారు. దీంతో ఏపీకి కొత్త గవర్నర్ వచ్చేసింది అంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా అమిత్ షా ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలవడం కూడా దీనికి ఒక కారణం. పైగా ఈ గవర్నర్ వచ్చి పదేళ్లు కావడంతో మార్పు గ్యారంటీ అయిన నేపథ్యంలో ఇది చాలా ఫాస్ట్ గా ప్రచారం అయిపోయింది. చివరకు అందులో నిజం లేదని స్వయంగా సుష్మ తేల్చేసింది.
అయినా ఒక కేంద్ర మంత్రి నిజంగా ఉత్తినే అలా గాసిప్ ని ట్వీట్ చేయడు. దీని వెనుక ఏదో జరిగి ఉంటుంది. బహుశా ఈ వార్త నిజమే అయినా ఆమె తనకు ఆ పదవి వద్దని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అందువల్లే ఉప రాష్ట్రపతిని కలిసి ఉండొచ్చు. ఆయన సలహా కోరి ఉండొచ్చు. ఏపీ గవర్నర్ గా ప్రభుత్వం నియమించినా అక్కడికి వెళ్లడంపై ఆమె ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు. లేకపోతే ఏమీ తెలియకుండా డాక్టర్ హర్షవర్దన్ వంటి సీనియర్ కేంద్రమంత్రి ట్వీట్ వేసే ప్రసక్తే లేదన్నది వాదన. ఈరోజో రేపో నిజాలు బయటకు రాకుండా పోతాయా?