దేశంలో కరోనా మూడో మరణం... ఇదే అసలు భయం

August 11, 2020

కరోనా వ్యాప్తి దేశంలో రెండో దశకు చేరుకుందన్న మాటలకు తగ్గట్లే.. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఊహించినరీతిలో మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ దేశంలో కరోనా కారణంగా రెండు మరణాలుచోటు చేసుకోగా.. తాజాగా మూడో మరణం నమోదైంది. ముంబయిలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు ఈ రోజు (మంగళవారం) మరణించాడు. అతని వయసు 64 ఏళ్లు.
కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. వారిద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారు కావటం గమనార్హం. వయసు ఎక్కువగా ఉన్న వారు కరోనా ప్రమాదకరంగా మారుతుందన్న మాటకు తగ్గట్లే భారత్ లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా బారిన పడి.. రికవరీ అయిన వారి సంఖ్య 13 కాగా.. వీరంతా యాభై ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం.
ఇప్పటివరకూ మరణించిన కరోనా బాధితుల్ని చూస్తే.. మొదటి మరణం ఢిల్లీలో చోటు చేసుకోగా.. రెండోది కర్ణాటకలో జరిగింది. మూడోది మహారాష్ట్రలో నమోదైంది. దేశంలో మరేరాష్ట్రంలో లేని విధంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దీంతో.. మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే నాగపూర్ తో సహా పలు ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధిస్తుండగా.. ప్రముఖ దేవాలయమైన షిర్డీలోని సాయిబాబా టెంపుల్ ను మూసివేశారు. అదే రీతిలో పలు ప్రాచీన కట్టడాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఏడువేలకు పైగా మరణాలు చోటు చేసుకోగా.. పాజిటివ్ కేసులు 1.7లక్షలకు చేరుకున్నాయి.
మన దేశం విషయానికి వస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ 24 కేసులు.. హర్యానాలో పదిహేను కేసులు.. ఉత్తరప్రదేశ్ లో పదమూడు.. కర్ణాటకలో ఎనిమిది.. ఢిల్లీలో ఏడు.. రాజస్థాన్.. తెలంగాణ.. లద్దాఖ్ లో నాలుగు కేసులు.. జమ్ముకశ్మీర్ లో మూడు కేసులు.. తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్.. పంజాబ్.. ఒడిశా.. ఉత్తరాఖండ్ లో ఒక్కొక్క కేసు వెలుగు చేశాయి.
అందోళన కలిగించే విషయం ఏమంటే.. తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తే.. విదేశాలనుంచి వస్తున్న వారిలో కరోనా పాజిటివ్ కేసులు 64 శాతం కాగా.. స్థానికంగా ఉన్న వారిలో వ్యాప్తి చెందిన పాజిటివ్  అవుతున్న కేసులు 36 శాతానికి చేరుకోవటం ఆందోళనకు గురి చేసే అంశం. మొత్తం పాజిటివ్ కేసుల్లో భారతీయులు 106 మంది కాగా.. విదేశీయులు 20 మందిగా చెబుతున్నారు. అంతో ఇంతో సంతోషించాల్సిన అంశం ఏమంటే.. మార్చి 11న అత్యధికంగా ఇరవై కేసులు నమోదైన తర్వాత.. మార్చి 15న పద్నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాత నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. ఇదే తీరులో మరో మూడు వారాలు సాగితే.. కరోనా కారణంగా మనకు పెద్ద ప్రమాదం లేదని ఊపిరి పీల్చుకునే వీలుంది.