న్యూజిలాండ్ ప్రధాని 2 మినిట్స్ సవాల్.. షాకయిన ప్రపంచం

August 08, 2020

రాజకీయ నాయకుల ప్రసంగాలంటే మినిమం గంట ఉండాల్సిందే.. అందులోనూ అధికారంలో ఉన్న నాయకులు తమ ప్రభుత్వం సాధించిన ఘనతలు చెప్పాలంటే ఎంత టైమిచ్చినా చాలదు. తప్పులన్నీ గత ప్రభుత్వానివి, గొప్పలన్నీ మా ప్రభుత్వానివి అంటూ గంటగంటలు ప్రసంగాలు దంచేస్తారు. అలాంటి నాయకులకు భిన్నంగా న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ తన రెండేళ్ల పాలనను 2 నిమిషాల 56 సెకన్లలో వివరించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేయగా అదిప్పుడు వైరల్‌గా మారింది.
నవంబరు 3తో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న జసిందా గత రెండేళ్లలో తన ప్రభుత్వం ఏమేం చేసిందో రెండు నిమిషాల్లో చెప్పాలనుకున్నారు. అయితే.. రెండు నిమిషాల్లో కాకపోయినా 2.56 నిమిషాల్లో మొత్తం పూర్తిచేశారు.
92 వేల ఉద్యోగాలు కల్పించడం.. కేన్సర్ కేర్ మెరుగుపరచడం, స్కూల్లలో కొత్తగా మరిన్ని తరగతి గదుల నిర్మాణం, మానసిక రోగులకు చికిత్స సదుపాయం పెంచడం వంటి భారీ జాబితాను చెప్పేసరికి రెండు నిమిషాలు దాటింది.
అయితే 37 సంవత్సరాల ఈ లేబర్ పార్టీ లీడర్ రెండేళ్ల పాలన గురించి చెప్పిన ఆ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని పనులు చేయగలరంటూ నెటిజన్లు ఆమెకు కితాబిచ్చాయి. న్యూజిలాండర్లే కాకుండా ఇతర దేశాల వారి నుంచీ ఆమెకు ప్రశంసలు దక్కాయి. నవంబర్ 3న రిలీజ్ చేసిన ఆ వీడియోను ఇప్పటికే 23 లక్షల మంది చూడడం విశేషం.