ఇంత దురహంకారమా..?

May 28, 2020

మంత్రులకు బెదిరింపులా?
స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే
పదవులు పోతాయా?
వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరా?
జగన్‌ తీరుపై వైసీపీలోనే అంతర్మథనం
‘స్థానిక’ విజయం కోసం ఎందుకీ తహతహ?
3 రాజధానులకు ప్రజల మద్దతు ఉందని చాటుకోవడానికే!
సొంత ఎమ్మెల్యేలంటే లెక్కలేదు.. మంత్రివర్గ సహచరులనైతే అసలు లక్ష్యపెట్టరు.. తన వల్లే వాళ్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తానే వారిని మంత్రులను చేశాను.. కనుక తన మాటే వారికి శాసనం కావాలి.. తాను చెప్పిందే చేయాలి.. ఇది నిబంధనలకు విరుద్ధమన్నా..ప్రజాస్వామ్యబద్ధం కాదన్నా సహించరు.. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యవహారమిది. ప్రజలు 151 స్థానాలిచ్చి తిరుగులేని విజయం అందించడంతో.. దురహంకారం ఆయన మాటల్లో నిలువెల్లా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి మూడు రాజధానులు పెట్టాలన్న నిర్ణయాన్ని శాసనమండలి కాదనడంతో సహించలేక ఆ సభనే రద్దుచేయాలని తీర్మానించారు. మూడు రాజధానులపై ప్రజల్లో వ్యతిరేకత చాపకింద నీరులా ప్రవహిస్తోందని అర్థమవడంతో.. స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తన పంతం నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. మంత్రులకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. 90 శాతం స్థానాలు సాధించకపోతే.. సదరు మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పించాల్సి ఉంటుందని.. వారికి ఇక రాజకీయ భవిష్యత ఉండదని బెదిరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల్లో టికెట్‌పై ఆశలు వదులుకోవలసిందేనని హెచ్చరించారు. ఈ బెదిరింపులను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతల్లో తీవ్రస్థాయిలో అంతర్మధనం చెలరేగుతోంది. ఇప్పటికే దుందుడుకు నిర్ణయాలతో ప్రజల్లో క్రమంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని.. మూడు రాజధానుల నిర్ణయంతో అది మరింత పెరుగుతోంద.. నిఘా వర్గాలు కూడా సమాచారం అందించినా.. ఇంత మొండిగా, నిరంకుశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని వారు అంతర్గతంగా మధనపడుతున్నారు.
ప్రతిదీ రాజకీయమే!
జగన్‌ ఆర్భాటంగా ప్రకటించిన నవరత్న పథకాల అమలు అంతంత మాత్రంగానే ఉంది. రెండు మూడు రత్నాల జోలికి ఇంతవరకు వెళ్లలేదు. మిగతా నాలుగైదు రత్నాల అమలుకు ప్రభుత్వం వద్ద సొమ్ముల్లేవు. అందరికీ పింఛన్లు ఎండమావిలా మారాయి. అర్థంలేని నిబంధనలతో 8 లక్షల పెన్షన్లు తీసేశారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్‌ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని ఊసెత్తలేదు. ఇళ్ల స్థలాల వ్యవహారం గందరగోళంగా మారింది. రైతు భరోసా కొందరికే పరిమితమైంది. ఆరోగ్యశ్రీ అయోమయం. విదేశీ విద్యాదీవెన కొండెక్కింది. అమ్మఒడి అందరికీ అందడం లేదు. స్కాలర్‌షిప్‌లు తీసేసి జగనన్న వసతి దీవెన తెచ్చారు. ప్రైవేటు కళాశాలల నోట్లో మట్టికొట్టారు. కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే కోర్సు మధ్యలోనే టీసీ ఇచ్చి పంపితే ఏమవుతుందో విద్యాశాఖ కనీస ఆలోచన కూడా చేయడం లేదు. ఆటోడ్రైవర్లకు వాహనమిత్ర పేరిట పది వేల సాయం అన్నారు. మొత్తమ్మీద లక్ష మందికి కూడా ఇవ్వలేదు. మత్స్యకారులకు వేట కాలంలో  ఇచ్చే భత్యం పెంచినా.. పెన్షన్‌ తీసుకునే వారు అర్హులు కాదనడంతో అదీ కొందరికే అందింది. అన్ని వర్గాలకు సాయం చేసి రాజకీయంగా బలం పెంచుకోవాలన్న ధ్యాస తప్ప.. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో ఆలోచించడం లేదు. అరకొరగా ఇస్తూ అట్టహాసంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
విపక్షాలకు బెదిరింపులు..
స్థానిక ఎన్నికల్లో విపక్షాల నామినేషన్లు వేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు శాయశక్తులా అడ్డుకుంటున్నారు. ఏకంగా పోలీసులే ఆయా అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి నామినేషన్లు వేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నేతలను పూర్తిగా టార్గెట్‌ చేశారు. అభ్యర్థులు వీరేనని తెలిస్తే చాలు.. వారు మాయమైపోతున్నారు. కిడ్నాపులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన ఓ బీజేపీ అభ్యర్థిని తరిమికొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందకుండా చేస్తున్నారు. ఆన్‌లైన్లో సాంకేతిక సమస్యలని అధికారులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రోడ్డుమీద మద్యం బాటిల్‌ కనబడిందని ఆ సమీపంలో ఉండే టీడీపీ నేతను అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లిపోవడం పోలీసుల దమనకాండకు పరాకాష్ఠ. ఓడిపోతామని అనుమానిస్తున్న మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో, రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో ఎన్నికలు ఆపేయించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. దానికి ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో కోడ్‌ అమలును పట్టించుకునేవారే లేరు. దాని అధికారాలను రాష్ట్ర అధికారులు కబ్జా చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.  అందరూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘానికి టీడీపీ, ఇతర పక్షాలు ఫిర్యాదు చేస్తే ఎవరూ స్పందించడం లేదు. అదే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయగానే టీడీపీ నేతలను పోలీసులు పట్టుకుపోతున్నారు. తన నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోవడానికి జగన్‌ ఇలాంటి అకృత్యాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. 

RELATED ARTICLES

  • No related artciles found