ఏపీ కుర్రాడిని అరెస్టు చేయించిన కేసీఆర్

May 30, 2020

చేతిలో ఫోన్ అందులో డేటా.. దాని సాయంతో న‌డిచే యాప్ లు ఉండ‌గానే ఒళ్లు అదుపు త‌ప్ప‌కూడ‌దు. అలా మాట్లాడితే జ‌రిగే న‌ష్టం ఎలా ఉంటుంద‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడిన ఏపీ యువ‌కుడ్ని తాజాగా రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల త‌గ‌రం న‌వీన్ డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. ఈ నెల 14న ఫ్రెండ్స్ లో క‌లిసి బ‌ర్త్ డే పార్టీ చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తాగేసిన అత‌గాడు.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశాడు. అదే క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.
తాను మాట్లాడిన మాట‌ల్ని వీడియోగా తీసి టిక్ టాక్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైర‌ల్ గా మారింది. తెలుగోళ్ల మ‌ద్య అన‌వ‌స‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల్ని తెచ్చి పెట్టేలా ఉన్న ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర స‌మితి విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు న‌ర్సింహా గౌడ్ రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు న‌వీన్ ను బుధ‌వారం అరెస్ట్ చేశారు. అత‌నిపై కేసు న‌మోదు చేశారు.
న‌వీన్ పై రాచ‌కొండ పోలీసులు ఐపీసీ సెక్షన్ 153(ఏ), ఐటీ యాక్ట్ సెక్షన్ 67ల కింద కేసులు నమోదు చేశారు. అత‌డి ద‌గ్గ‌ర నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా... చంద్రబాబును ఏపీలో పలువురు తిడుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం అరెస్టు చేయడంలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో చంద్రబాబును తిడుతూ చాలామంది పోస్టులను చేశారు.  ప్రజా స్వామ్యంలో ప్రభుత్వ అధినేతలను విమర్శిస్తే అరెస్టు చేసే ప్రభుత్వం ఒక్క తెలంగాణయే. కానీ ఏపీలో అలా కాదు.