రేవంత్ రెడ్డి చేసిన పనికి టీఆర్ఎస్ లో సౌండ్ లేదు

August 07, 2020

కేసీఆర్ బండారాన్ని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బట్టబయలు చేశారు. సరిగ్గా 75 రోజుల క్రితం కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. హైదరాబాదుకు చుట్టు ఒక్కో ఆస్పత్రిని ఘనంగా నిర్మించుకుందాం. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి (Telangana Inistitute of Medical sciences- TIMS ) ఏర్పాటు చేస్తాం అని ఘనంగా ప్రకటించారు. ఏప్రిల్ లో ప్రారంభం కూడా చేశారు. 

పది వేల కేసులు వచ్చినా డీల్ చేయగలిగిన స్థితిలో ప్రభుత్వం ఉంది. ఆందోళన అక్కర్లేదు అని కేసీఆర్ గొప్పంగా ప్రకటించారు. అంతా సిద్ధం చేసినట్లుచెప్పాడు. కట్ చేస్తే కొద్దిరోజుల క్రితం... గాంధీలో పేషెంట్లు నిండిపోవడంతో నిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చమని ఆదేశాలు వచ్చాయి.

అయితే... టిమ్స్ ఏమైందని చాలామందిలో అనుమానం వచ్చింది. ఇక మీడియా దానిని రాయలేదు. తీరా ఈరోజు రేవంత్ రెడ్డి దానిని ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ ఒక వీడియో విడుదల చేస్తూ ‘‘అక్కడ ఎటువంటి ఆస్పత్రి సదుపాయాలు లేవు. నలుగురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఇదీ మన ముఖ్యమంత్రి మాటల గారడీ... ఆయన గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. టిమ్స్ గురించి అంత గొప్పగా చెప్పాడు? చివరకు ఏమైంది.. ఏమీ లేదు. నిమ్స్ మీద ఆధారపడ్డారు. అంత ఘనంగా ప్రచారం చేసుకుని మీడియాలో రాయించుకున్నాడు... ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి. కేసీఆర్ అంత గొప్పగా చెప్పిన ఈ ఆస్పత్రికి డ్రైనేజీ లేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

టిమ్స్ భవనం డ్రైనేజీ నీరు హైదరాబాదు విశ్వవిద్యాలయంలోకి వెళ్తోందట. అది తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ విషయంలో తీసుకుంటున్న చర్యలు అని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తన మాటల గారడీ ప్రదర్శించడం తప్ప రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ ఉండదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.