తిరుమల : త్వరలో దర్శనం; అదృష్టవంతులకే

August 04, 2020

వందేళ్ల అనంతరం జగన్ హయాంలో తిరుమల గుడి తలుపులు భక్తులకు మూతపడ్డాయి. ప్రతి రోజూ జరిపే నిత్య పూజా కైంకర్యాలు ఆగలేదు గాని నిత్యకళ్యాణం, పచ్చ తోరణంలా నిత్యం లక్షలాది మందితో కళకళలాడిన తిరుమల వెలవెలబోయిన విషయం చూశాం. గతంలో మన కళ్లతో ఎపుడూ చూడని దృశ్యాలను కొన్ని వీడియోల్లో చూశాం.

మహమ్మారి విజృంభణతో భక్తులకు భగవంతునికి మధ్య భౌతిక దూరం పెరిగింది. అయితే, కరోనా ఉన్నంత వరకు గుడి తలుపులు భక్తులకు మూసేయడం కంటే జాగ్రత్తలతో తెరవడం మంచిదని భావిస్తోంది టీటీడీ. ప్రభుత్వం అనుమతి వచ్చాక దర్శనాలు కల్పించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. క్యూ కాంప్లెక్సులు ఇప్పట్లో వాడరు. అలాగే భక్తుల విషయం భౌతిక దూరం నిబంధన కచ్చితంగా పాటిస్తారు. రోజుకు 60 వేల నుంచి లక్ష మందికి దక్కే దర్శనం... ఇక కేవలం రోజుకు 7000 మందికే దక్కనుంది. అంటే స్వామి వారి దయ ఉన్న అదృష్టవంతులకే దర్శన భాగ్యం. 

గంటకు 500 మంది చొప్పున రోజుకు 14 గంటలు దర్శనం కల్పిస్తారు. అంటే మొత్తం 7 వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు. కచ్చితంగా రిజిస్ట్రేషను చేసుకున్నవారినే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతి ఇస్తారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటాయి. ఎవరికి ఎలా కేటాయించాలి అనేది తదుపరి నిర్ణయిస్తారు. మొత్తానికి జూన్ నెల నుంచి స్వామి వారి దర్శన భాగ్యం దక్కే అవకాశం కనిపిస్తోంది.