తెలుగు ప్రజలకు అది చెప్పలేనంత ఇష్టం మరి !...

August 15, 2020

శ్రీవారి లడ్డూనా మజాకానా? 3 గంటల్లో 2.4 లక్షల లడ్డూల సేల్
దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా తిరుమల శ్రీవారి ఆలయంతో పోటీ పడలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవస్థానాల్లో తిరుమల తిరుపతి ఒకటి. స్వామివారి ప్రసాదమైన లడ్డూకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. లాక్ డౌన్ వేళ.. శ్రీవారి ప్రసాదాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో రూ.50లకుఅమ్మే లడ్డూను రూ.25 సబ్సిడీ ధరను ఫిక్స్ చేశారు.
ఏపీలోని 12 జిల్లా కేంద్రాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అమ్మకానికి పెట్టారు.

లాక్ డౌన్ వేళలోనూ స్వామివారి ప్రసాదాన్ని పొందేందుకు భారీగా పోటీ పడ్దారు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 2.4 లక్షల లడ్డూల్ని అమ్మేశారు. లడ్డూ అమ్మకాల్లో ఇదో రికార్డుగా చెబుతున్నారు. ఏపీలోని గుంటూరు తప్పించి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అమ్మకాలు చేపట్టారు. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా గుంటూరులో తిరుపతి లడ్డూ అమ్మకాల్ని చేపట్టలేదు.

సోమవారం 2.4లక్షల లడ్డూ అమ్మకాలు స్వల్ప వ్యవధిలోనే అమ్మేయటంతో.. మంగళవారం మరో 2 లక్షల లడ్డూల్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూల కోసం తమిళనాడు.. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. త్వరలోనే ఆ రాష్ట్రాలకు శ్రీవారి లడ్డూల్ని పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గడిచిన రెండు నెలలుగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తుల కోసం నిలిపివేసిన వేళ.. స్వామివారి లడ్డూ ప్రసాదం దొరకటంతో భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.