శ్రీవారి ఆలయం మూసివేత.. బ్రహ్మం గారు చెప్పింది అది కాదు

August 04, 2020

ఏదైనా జరిగిన వెంటనే పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిందే జరిగిందంటూ ప్రచారం జరగటం మామూలే. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా యూపీ నుంచి వచ్చిన 110 మంది భక్తుల సమూహంలోని ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించటంతో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అయితే.. సదరుభక్తుడికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానమే తప్పించి.. అది నిజం కాకపోవటంతో అందరూఊపిరి పీల్చుకున్నారు.
ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తినా.. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని టీటీడీ తీసుకుందని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనే కాదు.. టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాన్ని మూసివేసినప్పటికీ.. స్వామివారికి జరపాల్సిన పూజలు.. కైంకర్యాలు మాత్రం యథావిధిగా సాగుతాయి.కాకుంటే స్వామివారికి ఏకాంతంగా వీటిని నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటే.. తిరుమలలో స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న వెంటనే.. పలువురు అప్పుడెప్పుడో ఇదే విషయాన్ని బ్రహ్మంగారు చెప్పినట్లుగా ప్రస్తావించటం కనిపిస్తోంది. ఇంతకూ పోతులూరి వీరబ్రహ్మంగారు తిరుమల దేవాలయం గురించి ప్రస్తావించారా? అంటే అవునని చెప్పాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం తిరుమలలో ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోకుండా.. రోజుల కొద్దీ స్వామివారికి ఎలాంటి పూజలు జరగవని.. అదే సమయంలో శ్రీశైలంలో ఈశ్వరుడికి మాత్రం పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయని.. అప్పుడే కలియుగ అంతంగా చెప్పుకున్నారు. దీని ప్రకారం చూస్తే.. తాజాగా మూసివేత.. ఏదీ బ్రహ్మంగారు చెప్పిన దానితో పోల్చటం ఏ మాత్రం సరికాదు.