పార్లమెంటుకు రావాల్సిన మహిళా ఎంపీ ఆసుపత్రిలోనా?

July 14, 2020

పశ్చిమబెంగాల్ టీఎంసీ ఎంపీ.. ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ ఆసుపత్రిలో చేరటం వార్తాంశంగా మారింది. ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటం తెలిసిందే. నిన్నటి వరకూ హుషారుగా కనిపించిన ఆమె.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం సంచలనంగా మారింది.
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాల్సిన ఆమె.. ఆసుపత్రి పాలు కావటం వెనుక కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్న (ఆదివారం) నుస్రత్ భర్త నిఖిల్ జైన్ బర్త్ డే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేశారు. దీనికి ఎంపీ నుస్రిత్ తో పటు ఆమె తన స్నేహితులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధిక మోతాదులో తీసుకున్న మందుల కారణంగా ఆమె అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళలో ఆమె అనారోగ్యానికి గురి కావటంతో వెనువెంటనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
అస్థమా సమస్యతోనే ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. అప్పటివరకూ హుషారుగా పార్టీలో ఉన్న ఆమె అనారోగ్యానికి గురి కావటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్వాసకోశ సమస్యలతోనే ఆసుపత్రిలో చేరినట్లుగా ఎంపీ నుస్రత్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ముస్లిం అయిన నుస్రత్ తన బాయ్ ఫ్రెండ్ కమ్ ప్రముఖ వ్యాపారి నిఖిల్ జైన్ ను పెళ్లాడటం.. పెళ్లి సందర్భంగా ఆమె హిందూ సంప్రదాయ పద్దతిలో మంగళసూత్రం కట్టించుకోవటం పెద్ద చర్చగా మారింది. అనంతరం దుర్గా పూజలో పాల్గొనటంపైనా ఒకరిద్దరు ముస్లిం మతపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి ఆమె తాజా అనారోగ్యానికి గురి కావటంతో ఆమెవెంటనే కోలుకోవాలని నుస్రత్ అభిమానులు కోరుకుంటున్నారు.