ఓ సామాన్యుడి మరణం... సెలబ్రిటీలకు కన్నీరు

August 12, 2020

సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్ట్‌, సినీ పీఆర్ఓ ప‌సుపులేటి రామారావు క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప‌సుపులేటి రామారావు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పసుపులేటి రామారావు మరణం పట్ల ప‌లువురు సినీ  ప్రముఖులు సంతాపం తెలిపారు. ఐదు ద‌శాబ్దాలుగా పత్రికా, సినీ రంగంలో ప‌సుపులేటి విశేష సేవలందించారు. ఎన్టీఆర్ మొద‌లుకొని జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు దాదాపు అందరూ అగ్ర హీరోలను ఇంటర్వ్యూ చేసిన ఘ‌న‌త ప‌సుపులేటికి ద‌క్కింది. సినీనటుడు మెగాస్టార్  చిరంజీవికి ప‌సుపులేటి అత్యంత ఆప్తుడు.
ప‌శ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజ‌వ‌రంలో పుట్టిన పసుపులేటి రామారావు డిగ్రీ చ‌దివారు. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించిన ప‌సుపులేటి....అనంత‌రం విశాలాంధ్ర, జ్యోతిచిత్ర పత్రికల‌తో పాటు అనేక ప‌త్రిక‌లు, సినీ మ్యాగ‌జైన్ల‌లో  జర్నలిస్ట్‌గా పనిచేసారు. సినిమాల‌కి పీఆర్ఓగా కూడా ప‌నిచేసిన ప‌సుపులేటి...ప్ర‌స్తుతం సంతోషం సినీ పత్రిక తరపున  పనిచేస్తున్నారు. టాలీవుడ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన సాంకేతిక నిపుణులను ఇంటర్వ్యూలు చేశారు. `నాటి మేటి సినీ ఆణిముత్యాలు` అనే పేరుతో కొన్ని ఇంట‌ర్యూలకు పుస్తకరూపం క‌ల్పించారు. టాలీవుడ్‌లో సుప‌రిచితుడైన ప‌సుపులేటి మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామారావు త‌న‌ ఆత్మబంధువ‌ని, ఆయ‌న కుటుంబానికి అండగా ఉంటాన‌ని  మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ప‌సుపులేటి క‌న్నుమూశారని వార్త తెలుసుకుని బాధపడ్డానంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.