తెలుగు దర్శకులకు హాలీవుడ్ ఛాన్స్ !!

May 31, 2020

రాజ్ నిడిమోరు.. కృష్ణ డీకే.. ఈ పేర్లు చూస్తే ఈ ఇద్దరూ తెలుగు వాళ్లని అర్థమైపోతుంది. ఐతే ఈ ఇద్దరు దర్శకులు ఇంటిని వదిలేసి రచ్చ గెలుస్తున్నారు చాలా కాలంగా. బాలీవుడ్లో ఈ ఇద్దరూ పేరు మోసిన దర్శక ద్వయం. షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్, స్త్రీ లాంటి వైవిధ్యమైన సినిమాలతో ఈ జోడీ మంచి పేరే సంపాదించింది. తెలుగులో ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను నిర్మించిన రాజ్-కృష్ణ.. ఇటీవలే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో తమదైన ముద్ర వేసింది. ఈ సిరీస్ అమేజాన్‌లో సూపర్ హిట్టయింది. దీనికి కొనసాగింపుగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కూడా త్వరలోనే రాబోతోంది. ఈ ట్రెండీ డైరెక్టర్లు ఇప్పుడు హాలీవుడ్ అరంగేట్రం చేయబోతుండటం విశేషం. అది చాలా పెద్ద స్థాయి ప్రాజెక్టు కూడా కావడం వీరి పేర్లు బాలీవుడ్లో మార్మోగేలా చేస్తోంది.

రాజ్-డీకే ఒక ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ‘ఎవెంజర్స్’ రూపకర్తలైన రుసో సోదరులు ఈ సిరీస్‌ హాలీవుడ్ వెర్షన్‌కు దర్శకత్వం వహించనుండగా.. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్‌ను రాజ్, కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సిరీస్‌కు ‘సిటాడెల్’ అనే పేరు పెట్టారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మ్యాడెన్ హీరోగా నటించే ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుంది. ఇంకా మరిందరు ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు ఈ సిరీస్‌లో నటించనున్నారు. ప్రియాంక చోప్రా ఈ వెబ్ సిరీస్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతూ ట్వీట్ చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్-డీకే ఈ సిరీస్‌తో ఇంటర్నేషనల్ రేంజికి వెళ్లబోతుండటం తెలుగు వాళ్లు గర్వించాల్సిన విషయమే. ఈ ఏడాది చివర్లో ‘సిటాడెల్’ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.