సినీ న‌టులంతా ఆ టీఆర్ఎస్ ఎంపీని ఎందుకు ఫాలో అవుతున్నారు?

August 07, 2020

తెలంగాణకు చెందిన ఓ టీఆర్ఎస్ ఎంపీ మంచి కార్య‌క్ర‌మం ప్రారంభించారు. దాన్ని ప‌ది మందికి విస్త‌రించాల‌ని అనుకున్నారు. ఆయ‌న ఆషామాషీ ఎంపీ కాదు. టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు న‌మ్మిన‌బంటు అనే పేరున్న ఆయ‌న‌ వ‌దిన కుమారుడు సంతోష్ రావు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా గ్రీన్ చాలెంజ్ అనే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌ముఖులు ఓ మొక్క‌ను నాటి...మ‌రో ముగ్గురికి మొక్క‌లు నాటాల‌నే చాలెంజ్ విస‌ర‌డం ఈ కార్య‌క్రమం ల‌క్ష్యం. ఈ గ్రీన్ చాలెంజ్ తెలంగాణ‌లో క్రియ‌శీలంగా జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ ప‌రంప‌ర‌లో సినీ న‌టులు బిజీగా ఉన్నారు.
ఓసారి జాబితాను ప‌రిశీలిస్తే...నిజంగానే తెలుగు సినీ ప్ర‌ముఖులు ఎంత‌లా స‌ద‌రు ఎంపీని ఫాలో అవుతున్నారో స్ప‌ష్ట‌మ‌వుతుంది. తాజాగా, ప్రముఖ సినీ నటి కీర్తిసురేశ్, యువ దర్శకుడు వంశీ అట్లూరి గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని సూరారం టెక్ మహీంద్ర క్యాంపస్‌లో మొక్కలు నాటారు. కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కీర్తిసురేశ్ పిలుపునిచ్చారు. సినీ నటుడు అర్జున్ సైతం మొక్క‌లు నాటారు. అనంత‌రం ఆయ‌న‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సినీ న‌టి కుష్బూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మొక్కలు నాటారు. తర్వాత మరో ముగ్గురికి హరిత సవాల్ విసురుతూ నటులు మీనా, సుహాసిని, డ్యాన్స్ మాస్టర్ బృందం మొక్కలు నాటాలని కోరారు. అనంతరం కుష్బూ మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు.
ఇక ఇటీవ‌లే, హైదరాబాద్ వనస్థలిపురంలో సినీ నటీనటులు తులసి, వై.విజయ, జూనియర్ రేలంగి, శశాంక, కిషోర్ దాస్, దర్శకుడు రామకృష్ణ, కెమెరామన్ జగదీశ్ తదితరులు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని నటి తులసి చెప్పారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాల్లో మొక్కలు బహుమతిగా ఇవ్వాలని సూచించారు. అటు.. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని కోరారు.
ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్ చాలెంజ్‌ పేరుతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ అన్నారు. జబ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నర‌సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన అశ్వినీదత్‌… నగరంలోని గచ్చిబౌలిలో గల తన నివాసంలో ఆయన తన కుమార్తె ప్రియాంక దత్‌, మనవడు రిషి కార్తికేయలతో కలిసి మొక్కలు నాటారు. ఇలా ఇటు సినీ ప్ర‌ముఖులు, అటు రాజ‌కీయ నాయ‌కులు కం సినీ వ‌ర్గాలు తెలంగాణ ఎంపీ పిలుపున‌కు ఓ రేంజ్‌లో స్పందిస్తుండ‌టం గ‌మ‌నార్హం.