అందరికంటే ముందొచ్చారు.. ఆదర్శంగా నిలిచారు

July 04, 2020

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు తరలుతున్నారు. కొన్ని చోట్ల అయితే పోలింగ్ ప్రారంభానికి ముందే వందల సంఖ్యలో వేచి చూశారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు సైతం ఓటు వేశారు.

అలాగే తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ ప్రముఖులు సైతం ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తారక్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేయగా, బన్నీ మాత్రం ఒంటరిగా వచ్చాడు. సినీ పరిశ్రమ నుంచి అందరి కంటే ముందుగా వచ్చిన వీరిద్దరూ ఆదర్శంగా నిలిచారని చెప్పడంలో సందేహం లేదు.