తమ ర్యాంకులు ప్రకటించిన తెలుగు హీరోలు

August 11, 2020

సోష‌ల్ మీడియా జ‌నాల‌కు సినిమాల‌కు మించిన కాల‌క్షేపం మ‌రొక‌టి ఉండ‌దు. ఐతే క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొత్త సినిమాల క‌బుర్లే లేకుండా పోయాయి. అయినా స‌రే.. క‌రోనా వైర‌స్‌తో ముడిపెట్టి సినిమాల ముచ్చ‌ట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు అభిమానుల చ‌ర్చ‌లు త‌మ హీరోల విరాళాల మీదికి మ‌ళ్లాయి. ఒక్కొక్క‌రు ప్ర‌క‌టించిన విరాళాల గురించి ప్ర‌స్తావించి.. త‌మ హీరో గ్రేట్ అంటే త‌మ హీరో గ్రేట్ అని వాదించుకుంటున్నారు. స్టార్లు ప్ర‌క‌టించిన విరాళాల‌కు.. వాళ్ల బాక్సాఫీస్ రేంజికి పోలిక పెడుతూ వాద‌న‌ల‌కు దిగుతున్నారు.

బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్లో ఎవ‌రూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు ప్ర‌భాస్. బాలీవుడ్ హీరోల్ని సైతం అత‌ను వెన‌క్కి నెట్టేశాడు. క‌రోనా విరాళం కూడా అదే స్థాయిలో ఉండ‌టంతో ఇండియాలో అత‌ణ్ని మించిన హీరో లేడంటూ అభిమానులు గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భాస్ కంటే ముందు రెండు కోట్ల విరాళం ప్ర‌క‌టించ‌డంతో టాలీవుడ్లో అత‌నే నంబ‌ర్ వ‌న్ అంటున్నారు. 

చిరంజీవి, మ‌హేష్ బాబు కోటి రూపాయ‌ల విరాళాల‌తో త‌మ స్థాయికి త‌గ్గ విత‌ర‌ణే చేశార‌ని అనుకుంటుండ‌గా.. అంద‌రి విరాళాల్ని ప‌రిశీలించి 1.25 కోట్ల‌తో ఒక మెట్టు పైన నిలిచే ప్ర‌య‌త్నం చేసిన బ‌న్నీ.. నాన్-బాహుబ‌లి రికార్డును నెల‌కొల్పాడ‌ని అత‌డి అభిమానులు అంటున్నారు. త‌న తండ్రి, బాబాయి ఇచ్చిన భారీ విరాళాల‌కు తోడు తాను కూడా రూ.70 ల‌క్ష‌ల విరాళం ఇచ్చి రామ్ చ‌ర‌ణ్ త‌న స్థాయిని నిలుపుకున్న‌ట్లు చెప్పుకుంటుండ‌గా.. తార‌క్ రూ.75 ల‌క్ష‌ల‌తో అత‌డితో స‌మానంగా నిలిచాడ‌ని భావిస్తున్నారు.