ఆ టాలీవుడ్ ప్రముఖుడికి ఏమైంది?

August 04, 2020

ఆ మధ్య వరకూ టీవీ చానళ్ల అత్యుత్సాహం కారణంగా తరచూ ఎవరో ఒక ప్రముఖుడు చనిపోయినట్లుగా బ్రేకింగ్ న్యూస్ వేయటం.. తర్వాత అది తప్పంటూ నాలుకర్చుకోవటం తెలిసిందే. రేటింగ్ లతో పాటు.. అందరికంటే తామే ముందున్నామన్న విషయాన్ని చెప్పుకునేందుకు ప్రముఖులకు తిప్పలు తెచ్చే వైనం పలుమార్లు చర్చనీయాంశంగా మారింది. చానళ్ల సమస్య ఒక కొలిక్కి రాకముందే.. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల పుణ్యమా అని ఏదో ఒక రచ్చ ఈ మధ్యన అలవాటైంది.

కనీసం కన్ఫర్మ్ చేసుకోకుండా.. ఎవరికి తెలిసిన సమాచారాన్ని వారు షేర్ చేయటం.. అదికాస్తా వైరల్ గా మారటంతో ఇప్పుడో సమస్యగా మారింది. టాలీవుడ్ సంగీత దర్శకుడు శశీప్రీతం విషయంలోనూ అలానే జరిగింది. శుక్రవారం రాత్రి వేళలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సంగీత దర్శకుడు కమ్ గాయకుడైన ఆయన గులాబీ.. సముద్రం లాంటి తెలుగు సినిమాలతో పాటు.. హిందీ మూవీలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.

మాయదారి మహమ్మారి సీజన్ కావటంతో.. శశీ ప్రీతంకు అనారోగ్యం అన్నంతనే.. అది కాస్తా కరోనా ఖాతాలో వేసేస్తూ కాసేపు వైరల్ చేశారు. తర్వాత ఆ సమాచారం తప్పని.. గుండె సంబంధిత సమస్యలతో ఒక ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినట్లుగా తెలిసిందే. అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ప్రముఖల విషయాల్లో.. అందునా వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. తిప్పలు తప్పవన్నదానికి నిదర్శనంగా శశీప్రీతం ఎపిసోడ్ ను చెప్పక తప్పదు.