కమల్ హాసన్ చేతికి టార్చిలైట్.. ఇక వెతకడమేనా?

June 03, 2020

తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నటుడిగా ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకొని విశ్వ నటుడిగా ఎదిగారు క‌మ‌ల్ హాస‌న్. ఈయన గ‌త యేడాది రాజకీయ గడపతొక్కి మక్కల్‌‌ నీది మయ్యం‌ అనే పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లో చురుగ్గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్‌హాసన్ 2018 ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తరపునే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని, ఎవరితో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన చేతులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. 

అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా రిజిస్టర్ అయిన 39 రాజకీయ పార్టీలకు గుర్తులకు కేటాయించింది. దీనిలో భాగంగా కమల్ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తు వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఈసీకి ధన్యవాదాలు తెలిపారు కమల్. మాకు టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. మా పార్టీకి తగిన గుర్తే లభించింది. తమిళనాడు, భారత రాజకీయాల్లో మక్కల్‌ నీది మయ్యం టార్చ్‌ బేరర్‌గా మారబోతోంది అని ఆయన పేర్కొన్నారు. 

ప్రస్తుత రాజకీయాల్లో మార్పును ఆశిస్తున్న కమల్ హాసన్.. తమిళ ప్రజల కలల్ని నిజం చేస్తారని భావిస్తున్నారు జనం. ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. స్వచ్ఛమైన చేతులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని చెప్పిన ఆయన.. అవినీతి పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో తాము చేతులు కలపమని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేయనుంది. అన్ని స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.