హెల్మెట్ పెట్టుకోనందుకు నెలన్నర జీతం కట్ !

August 07, 2020

కొత్త ట్రాఫిక్ రూల్స్ దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తప్పు చేస్తే.. జీవితంలో మళ్లీ ఆ తప్పు చేసే ఆలోచన వచ్చేందుకు సైతం భయపడేలా ఉన్న జరిమానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీల్ లైఫ్ రియల్ గా మారేదెప్పుడున్న దానికి కొత్త వాహన చట్టం సమాధానంగా మారింది. భారీ జరిమానాలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొత్త చట్టం అమలులోకి రాని రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తాజా ఉదంతం గురించి తెలిసిన తర్వాత.. కొత్త చట్టం వద్దంటే వద్దనటం ఖాయం. ఎందుకిలా అంటే..
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కు నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానాను విధించారు. ఇంతకీ అతగాడు చేసిన తప్పేమంటే.. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం. దీంతో.. అతడికి భారీ జరిమానాను విధించారు. రూ.34వేల ఫైన్ విధించిన వైనం సంచలనంగా మారింది. అంటే ఆల్మోస్ట్ నెలన్నర జీతం.
పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి మరేమిటి? అన్నదిప్పుడు ప్రశ్న. సామాన్యులతో పోలిస్తే.. పోలీసు అధికారులకే జరిమానాలు భారీగా ఉంటాయని చెబుతున్నారు. చట్టాన్ని అమలు అయ్యేలా చేసే బాధ్యతను నిర్వర్తించేవారు.. మరింత బాధ్యతాయుతంగా ఉండాలని.. అందుకు తగ్గట్లే వాహన చట్టంలోని నిబంధనల్ని బ్రేక్ చేస్తే.. వారికి రెట్టింపు జరిమానా విధించాలంటూ కొన్ని రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి మరో అడుగు ముందుకేసి.. భారీ జరిమానాతో సంచలనంగా మారారు రాంచీ పోలీసులు.
రాంచీకి చెందిన రాకేశ్ కుమార్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటాడు. అయితే.. అతగాడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ట్రాఫిక్ సిబ్బంది కంటపడ్డారు. అతన్ని ఆపిన సిబ్బంది.. ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా కొత్త చట్టం ప్రకారం అతడికి రూ.34వేల భారీ జరిమానాను విధించారు. హెల్మెట్ ధరించకపోవటంతో పాటు.. ఇతరత్రా నిబంధనల్ని కూడా అతడు ఉల్లంఘించటంతో ఇంత భారీ జరిమానా తప్పలేదని చెబుతున్నారు.