ట్రాఫిక్ ఫైన్ల క‌ల‌కలం..ఇంకో షాకిచ్చిన కేంద్రం

August 03, 2020

ఇటీవ‌లే అమ‌లులోకి వ‌చ్చిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ ఫైన్ల బాదుడుతో చుక్క‌లు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చ‌ట్టాన్ని అమలు చేయాలని కేంద్రం గెజిట్‌ ఇచ్చింది. సురక్షిత ప్రయాణం కోసమే కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన‌ట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, కొత్త చట్టంలో జరిమానాను 5 నుంచి 10 రెట్లు పెంచడంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ...'కొత్త మోటారు వాహన చట్టం'లో ఎలాంటి మార్పులూ చేయబోమని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అయితే, బంధనలు ఉల్లంఘించితే జరిమానా విధింపులను ఆయా రాష్ట్రాల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేశారు.
కొత్త చట్టం ప్రకారం జరిమానా విధింపులపై అన్ని రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటి వరకూ ఆయా రాష్ట్రల పరిస్థితులకు అనుగుణంగా జరిమానాలను తగ్గించి ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. వాటిల్లో గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, కర్నాటక, అసోం రాష్ట్రాలున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా ఈ విష‌య‌మై స్పందిస్తూ వివిధ వ‌ర్గాల నుంచి వ‌చ్చి ఫిర్యాదులు, అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాతే కొత్త చ‌ట్టం రూపొందింద‌ని అన్నారు. ప్రతీఏటా దాదాపు 5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, ఈ ఘటనల్లో 1.5లక్షల మందికి పైగా చనిపోతున్నారని గడ్కరీ తెలిపారు. 2.5లక్షల మంది వికలాంగులవుతున్నారని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికే కేంద్ర ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చ‌ట్టంలో ఎలాంటి మార్పులు చేయ‌బోమ‌ని  ఆయన మరోసారి స్పష్టం చేశారు.
అయితే, కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించితే రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా స్పష్టంచేశారు. కేంద్రం చట్టం తీసుకొచ్చినా, దాన్ని యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అవసరం లేదని, ఫైన్ల విష‌యంలో కొన్ని మార్పులు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుందని వివ‌రించారు. అయితే,డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌లాంటి నేరాలకు కొత్త యాక్ట్ ప్రకారమే శిక్షలు అమలుకానున్నాయి.