లాక్ డౌన్ వేళలో ప్రజలకు ఇంకో స్వీట్ న్యూస్

August 11, 2020

క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి. ఆదివారం నుంచి శనివారం వచ్చేస్తుంది. ఎప్పుడూ ఊహించలేనంత నిదానంగా రోజులు గడుస్తున్నాయి. అన్ని రోజులు ఒకేలా ఉండటం.. అది కూడా అందరి జీవితాలు ఒకేలాంటి సమస్యతో ఉండటం లాంటి అరుదైన పరిస్థితి కరోనా పుణ్యమా అని చోటు చేసుకుందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన వేళ.. జీవితంలో ఒక్కటంటే ఒక్క కొత్త అప్డేట్ అనేది లేకుండా పోతుందని ఫీలయ్యే వారెందరో. ఇలాంటి వేళ.. వావ్ అనేలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ట్రాయ్.
టీవీ లేని ఇల్లు దేశంలో కనిపించదు. టీవీ ఉన్నాక కేబుల్ లేదంటే డీటీహెచ్ కనెక్షన్ లేనోళ్లు ఉండరు. అలాంటి డీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నాక.. వారి సేవలు నచ్చకున్నా.. దాన్నే కంటిన్యూ చేయాలి. ఒకవేళ నో అనుకుంటే.. దానికి మళ్లీ ఖర్చు మోపెడు అవుతుంటుంది. దీంతో.. చాలామందికి ఇష్టమున్నా.. లేకున్నా డీటీహెచ్ ను కంటిన్యూ చేసేస్తుంటారు. ఇప్పుడిక అలాంటి తిప్పలు అస్సలు ఉండవు. ఎందుకంటే.. సెల్ ఫోన్లో టెలికం ఆపరేటర్ ను ఎలా అయితే.. మార్చేసుకునే వీలు ఉందో.. డీటీహెచ్ సంస్థల్ని కూడా మార్చేసుకునే వీలు కల్పిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది.
మీరు సెట్ టాప్ బాక్సు ఏ సంస్థ నుంచైనా కొని ఉండొచ్చు. వారిచ్చే సేవలు నచ్చకుంటే.. వెంటనే వేరే డీటీహెచ్ సర్వీసుకు మారిపోయేలా అవకాశాన్ని కల్పిస్తూ ట్రాయ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే.. ఆపరేటర్ మారతారు కానీ ఇంట్లోని సెట్ టాప్ బాక్సు మాత్రం మారదన్న మాట. ఇప్పటివరకూ ఇలాంటి రూల్ లేకపోవటంతో చెలరేగిపోయే ఆపరేటర్లు ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించే వీలుందంటున్నారు. ఏమైనా.. లాక్ డౌన్ వేళ.. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారుల చేత వావ్ అనేలా చేస్తుందని చెప్పక తప్పదు. తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు డీటీహెచ్ సర్వీసుల్ని అందించే కంపెనీలకు ఆర్నెల్లు గడువు ఇచ్చింది.