​హమ్మయ్య... ఏపీలోకి ఎంట్రీ ఇక ఈజీ​

August 05, 2020

ఊరందరిదీ ఒక దారైతే ఏపీ సర్కారుది ఇంకోదారి అన్నట్లు.. ప్రతి నిర్ణయంలోను ఏపీ ముఖ్యమంత్రి ఇలాగే ఉన్నారు. ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. కానీ ఎక్కువ కేసులు ఏపీలోనే బయటపడుతున్నాయి. నిజానికి భారీగా టెస్టులు చేస్తే నెలలోపు మార్పు కనిపించాలి. కేసులు కంట్రోల్ అవ్వాలి. కానీ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. 

మరోవైపు దేశంలోనే కొత్త కేసుల నమోదులో నెం.1 స్థానంలో ఉంటూ మా రాష్ట్రంలోకి రావాలంటే పాస్ తీసుకోవాల్సిందే అని ఏపీ సర్కారు రూల్ పెట్టింది. డేంజర్ జోన్లోకి పోవడానికి పాస్ తీసుకోవడం ఏంటో  ఎవరికీ అర్థం కావడం లేదు.  కొద్దిరోజులు దీనిపై విమర్శలు రావడంతో ఏపీ సర్కారు దిగొచ్చించిది... ఏపీలోకి ఎంట్రీని సులభతరం చేసింది. 

ఇకపై కూడా పాస్ తీసుకోవాలి. కానీ మునుపటిలా అత్యవసరాలకే కాకుండా అప్లై చేసిన ప్రతి ఒక్కరికీ పాస్ వస్తుంది. ఇందుకోసం ఆటోమేటిక్ పాస్ సిస్టమ్ ను తెచ్చింది. స్పందన వెబ్ సైట్లో దరఖాస్తు చేసిన వెంటనే మొబైల్ కి పాస్ వస్తుంది.  సరిహద్దులో ఐడీ కార్డు చూపించి వెళ్లిపోవచ్చు.

వివరాలను మనం ఏ ఊరికి వెళ్తున్నామో... ఆ ఊరి స్థానిక కార్యాలయానికి పంపిస్తారు. తద్వారా వారి లక్షణాలను బట్టి పరీక్షలు చేయిస్తారు. ఇంతకాలం పాస్ ల గోలతో ఇబ్బందిపడిన ప్రజలకు పెద్ద కష్టం తీరింది. 

ముఖ్యంగా హైదరాబాదులో ఏపీ వాళ్లు ఎక్కువగా స్థిరపడటం వల్లే ఇన్ని ఇబ్బందులు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ రాజధాని హైదరాబాదే కాబట్టి ఏపీలోని ప్రతి ఊరికి హైదరాబాదుతో సంబంధాలున్నాయి.