ఆప్త మిత్రుడిని కాపాడేందుకు త్రివిక్రమ్ మరో ప్రయత్నం

February 20, 2020

ఒకప్పుడు సునీల్‌ వైభవం చూసి టాలీవుడ్లో హీరోలు కూడా అసూయ చెందే పరిస్థితి ఉండేది. బ్రహ్మానందం లాంటి లెజెండ్‌ను కూడా దాటిపోయి టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న కమెడియన్‌గా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో సునీల్‌కు స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ ఉండేది. డిమాండ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో సునీల్ విఫలమయ్యాడు. హీరో వేషాల మీద మోజుతో కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. హీరోగా అతను చేసిన ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’, ‘పూల రంగడు’ సినిమాలు హిట్టయి సునీల్‌ను పక్కదోవ పట్టించాయి.

హీరోగా అవసరం లేని విన్యాసాలు చేసి, తన లుక్ మార్చుకుని కామెడీ ఇమేజ్‌ను పూర్తిగా చెడగొట్టుకున్నాడతను. వరుస ఫ్లాపుల మూలంగా హీరోగా మార్కెట్ కోల్పోయి, కామెడీకి పనికి రాకుండా పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నాతను.హీరో వేషాలు విడిచిపెట్టి ఇప్పటిదాకా అరడజను దాకా సినిమాల్లో కమెడియన్ రోల్స్ చేశాడు సునీల్. కానీ వాటిలో ఒక్కటీ క్లిక్ అవ్వలేదు. ఒకప్పుడు సునీల్ కనిపిస్తే నవ్వొచ్చేది. కానీ ఇప్పుడు అతను ఎన్ని విన్యాసాలు చేస్తున్నా నవ్వు రావట్లేదు. గతంలో సునీల్‌తో అదిరిపోయే కామెడీ చేయించిన అతడి ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ సైతం ‘అరవింద సమేత’లో చేతులెత్తేశాడు. సునీల్ అందులో నవ్వించలేకపోయాడు. ఇక సునీల్‌ను ఎవ్వరూ కాపాడలేరన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు.

ఐతే త్రివిక్రమ్ అంతటితో ఆగిపోవట్లేదు. మిత్రుడి కోసం మరో క్యారెక్టర్ రాశాడు. తన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’లో సునీల్‌కు ఓ కీలక పాత్రే ఇచ్చాడట త్రివిక్రమ్. దీపావళి కానుకగా విడుదల చేసిన ‘రాములో రాములా’ పాట చివర్లో కనిపించిన కీలక పాత్రధారుల్లో సునీల్ కూడా ఉన్నాడు. మరి ఈసారైనా సునీల్ క్యారెక్టర్ క్లిక్ అయి.. అతడి కామెడీ పండి.. కెరీర్ ముందుకు సాగుతుందేమో చూడాలి.