ఇండస్ట్రీలో త్రివిక్రమ్ పెద్దమనసు

July 08, 2020

టాలీవుడ్లోకి మరో వారసుడొస్తున్నాడు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం కానున్నాడు. అతను నటిస్తున్న సినిమా పేరు.. ఓ పిట్ట కథ. భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడూ పెద్ద హీరోలతో మాస్ సినిమాలు తీసే ఆనంద్ ప్రసాద్.. కాన్సెప్ట్ బేస్డ్ లవ్ స్టోరీతో ముందుకొస్తున్నారు. చందు ముద్దు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘ఓ పిట్ట కథ’ అనే టైటిల్‌కు ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఒక పాత అంబాసిడర్ కారు, ముందు ఐస్ క్రీమ్, కాఫీ, టీ గ్లాసులు పెట్టి.. వాటి ముందు క్రిష్, వెంకటలక్ష్మి, ప్రభు అంటూ పేర్లు పెట్టారు. బహుశా ఈ మూడు పాత్రలు సినిమాలో కీలకం కావచ్చు. ఆ పాత్రల అభిరుచి మేరకు ఐస్ క్రీమ్, కాఫీ, టీ గ్లాసులు పెట్టినట్లున్నారు. ఈ సెటప్ అంతా కొంచెం కొత్తగానే ఉండి ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో కొంతమేర త్రివిక్రమ్ భాగస్వామ్యం కూడా ఉండటం విశేషం. టైటిల్ లోగోను త్రివిక్రమే లాంచ్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ కథను ముందుగా త్రివిక్రమే విన్నారట. తర్వాత దర్శకుడు చందు రెండు మూడు టైటిళ్లు చెప్పగా.. అందులోంచి ‘ఓ.. పిట్ట కథ’ బాగుందని త్రివిక్రమే ఎంపిక చేశాడట. అంతే కాక... ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అంటూ క్యాప్షన్ జోడించింది కూడా ఆయనేనట. ఇంతకుమించి తన భాగస్వామ్యం సినిమాలో ఏమీ లేదని త్రివిక్రమ్ వెల్లడించాడు. పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న బ్రహ్మాజీకి.. చాలా మంచి పేరుంది. వ్యక్తిగా కూడా బ్రహ్మాజీ ఇండస్ట్రీలో చాలామందికి ఆత్మీయుడు. ఆయనపై అభిమానంతోనే త్రివిక్రమ్ ఈ మేరకు సినిమాలో భాగస్వామ్యం అయ్యాడు. బ్రహ్మజీ అప్పటికే పెళ్లయిన, తన కంటే వయసులో పెద్ద అయిన మహిళను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆమె కొడుకైన సంజీవ్‌ను సొంత కొడుకులాగే చూసుకుంటున్నారు. అతణ్ని ఇప్పుడు హీరోగా కూడా పరిచయం చేస్తుండటం విశేషం.